దసరా మద్యం ధమాకా!
- ఈ నెల 19 రోజుల్లోనే రూ.2,054 కోట్ల అమ్మకాలు
- 19న ఒక్కరోజే రూ.300 కోట్ల విలువైన మద్యం విక్రయాలు
- సీజన్లో కొత్త రికార్డు
అక్టోబర్ 21 (విజయక్రాంతి): తెలంగాణలో దసరా పండుగ ఎక్సైజ్ శాఖకు ధమాకానిచ్చింది. అక్టోబర్ నెలలో రాష్ట్రంలో మద్యం ఏరులై పారింది. అక్టోబర్ మొదటి 19 రోజుల్లో రాష్ట్రంలో ఊహించని విధంగా మద్యం విక్రయాలు భారీగా నమోదయ్యాయి. ఎక్సైజ్ శాఖ గణాంకాల ప్రకారం.. అక్టోబర్ 1 నుంచి 19 వరకు రాష్ట్రవ్యాప్తంగా ఏకంగా రూ.2,054.51 కోట్ల విలువైన మద్యం అమ్ముడైంది.
గత ఏడాదితో పోలిస్తే ఇది 37.02 శాతం వృద్ధి. అయితే, ఈసారి ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్ (ఐఎంఎఫ్ఎల్) కంటే బీర్ల అమ్మకాలు అత్యధికంగా పెరిగాయి. ఈ కాలంలో బీర్ల విక్రయాలు దాదాపు 41 శాతానికి పైగా ఎగబాకాయి.
గత ఏడాది ఇదే కాలంలో 21.55 లక్షల కేసుల బీర్లు అమ్ముడవగా, ఈసారి అది 30.37 లక్షల కేసులకు చేరుకుంది. ఇక ఐఎంఎఫ్ఎల్ విక్రయాలు గత ఏడాది 14.16 లక్షల కేసులు ఉండగా, ఈ ఏడాది 18.38 లక్షల కేసులకు పెరిగాయి.
ఎక్సైజ్ శాఖ రోజువారీ నివేదికల ప్రకారం.. అక్టోబర్ 19న ఒక్కరోజే రాష్ట్రంలో రూ.303.40 కోట్ల విలువైన మద్యం విక్రయాలు జరిగాయి. గత ఏడాది ఇదే రోజుతో పోలిస్తే అమ్మకాల్లో భారీగా పెరుగుదల నమోదైంది. పండుగ సీజన్ ప్రారంభంలో అమ్మకాలు మందకొడిగా సాగినప్పటికీ, రెండో వారం నుంచి అమ్మకాలు ఒక్కసారిగా పుంజుకున్నట్లుగా ఎక్సైజ్ అధికారులు తెలిపారు.
అక్టోబర్ 16 నాటికి రూ.1,527.85 కోట్లకు చేరిన క్యుమ్యులేటివ్ సెల్స్.. అక్టోబర్ 19 నాటికి రూ.2,054 కోట్లకు చేరాయి. పండుగ వేళ బీర్లకు డిమాండ్ విపరీతంగా పెరగడం విశేషమని, ఎక్సైజ్ శాఖ విడుదల చేసిన ఈ నివేదిక కేవలం అక్టోబర్ 19 వరకు మాత్రమే నమోదైన లెక్కల ఆధారంగానే రూపొందించామని ఎక్సైజ్ అధికారులు స్పష్టం చేశారు.