కరెంట్ కనెక్షన్.. అవినీతి కలెక్షన్!

27-10-2026 | 05:25am
  1. టీజీఎస్పీడీసీఎల్లో నిలువు దోపిడీ
  2. క్యూర్ పరిధిలో మామూళ్ల దందా
  3. కంప్యూటర్ సేవా కేంద్రాలు, బ్రోకర్ల మాయాజాలం
  4. లంచం ఇస్తేనే కొత్త కనెక్షన్లు?

(ఎ.చంద్రశేఖర్‌రావు) :

సంగారెడ్డి బ్యూరో, అక్టోబర్ 26 (విజయక్రాంతి): తెలంగాణ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్(Telangana Southern Power Distribution Company Limited) (టీజీఎస్పీడీసీఎల్) పరిధిలో కొత్త విద్యుత్ కనెక్షన్(New Electricity Connection) పొందడం సామాన్యుడికి తలకు మించిన భారంగా మారింది. పారదర్శకత కోసం ప్రవేశపెట్టిన ఆన్‌లైన్ దరఖాస్తు(Online application) విధానం, క్యూర్ ప్రక్రియ ప్రస్తుతం అవినీతికి అడ్డాగా రూపాంతరం చెందాయి.

క్షేత్రస్థాయి సిబ్బంది, బ్రోకర్లు, కొన్ని కంప్యూటర్ సేవా కేంద్రాలు(Computer Service Centers) కుమ్మక్కై కొత్త కనెక్షన్ల జారీని ఒక పెద్ద ‘కలెక్షన్ల దందా’గా మార్చేశారు. సంస్థ పరిధిలోని 21 సర్కిళ్లలో గల 92 సీఎస్సీ కేంద్రాల్లో వినియోగదారులకు చుక్కలు కనిపిస్తున్నాయి. కొత్త సర్వీస్ కనెక్షన్ అయినా, కేటగిరీ మార్పు అయినా నిబంధనల ప్రకారం చెల్లించాల్సిన ఫీజు కంటే పదింతలు ఎక్కువ ముట్టజెప్తేనే పని ముందుకు సాగని దుస్థితి నెలకొంది. 

క్యూర్‌లో మితిమీరిన లంచాల పర్వం

కొత్త కనెక్షన్ ఇవ్వడానికి ముందు క్షేత్రస్థాయిలో లోడ్ సాధ్యసాధ్యాలు, కేబుల్ దూరం, ట్రాన్స్‌ఫార్మర్(Transformer) సామర్థ్యాన్ని పరిశీలించి అంచనా వేసే క్యూర్ ప్రక్రియలో అవినీతి పరాకాష్టకు చేరింది. హైదరాబాద్ మహానగరంతో పాటు వేగంగా విస్తరిస్తున్న క్యూర్ పరిధిలోని 27 సీఎస్సీ కేంద్రాలలో పరిస్థితి అత్యంత దారుణంగా తయారైంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం చెల్లించాల్సిన డెవలప్‌మెంట్ చార్జీలు, సెక్యూరిటీ డిపాజిట్ల కంటే మూడు నుంచి నాలుగు రెట్లు అదనంగా వసూలు చేస్తున్నారు.

గృహ వినియోగ కనెక్షన్ల నుంచి మొదలుకొని, కమర్షియల్, అపార్ట్‌మెంట్ల కనెక్షన్ల వరకు ప్రతి ఫైల్ కదలాలన్నా వేలల్లో లంచాలు సమర్పించుకోవాల్సి వస్తోంది. బ్రోకర్లు చెప్పినంత ఇచ్చుకుంటేనే క్షేత్రస్థాయి సిబ్బంది (లైన్‌మన్, సబ్-ఇంజనీర్) ఫైల్‌ను ముందుకు కదుపుతున్నారు. లేదంటే సాంకేతిక సాకులు చెప్తూ నెలల తరబడి పెండింగులో పెడుతున్నారు. ఉమ్మడి రంగారెడ్డి, మెదక్ జిల్లాల పరిధిలోని పలు కేంద్రాల్లో ఏ పనికి ఎంత ఇవ్వాలో నిర్ణయించే రేట్ల పట్టికలను బహిరంగంగానే సూచిస్తూ సామాన్యులను జలగల్లా పీడిస్తున్నారు. 

పటాన్‌చెరులో వెలుగుచూసిన దందా

సంగారెడ్డి సర్కిల్ పటాన్‌చెరు డివిజన్‌లో విద్యుత్ సేవలు ఎంత ఖరీదుగా మారాయో ఇటీవల ఆధారాలతో వెలుగులోకి వచ్చిన సంఘటనలే నిదర్శనం. పటాన్‌చెరు సీఎస్సీ కేంద్రంలో సాక్షాత్తూ ఒక ఉన్నతాధికారికి సంబంధించిన దరఖాస్తు పైనే సిబ్బంది ముడుపుల రేట్ల పట్టికను చూపించి అవాక్కయ్యేలా చేశారు. కింది స్థాయి సిబ్బంది నుంచి సెక్షన్ అధికారుల వరకు అందరు ఒక్కటై  ముడుపులు ఇవ్వని దరఖాస్తులను పెండింగులో పెడుతూ ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఈ దోపిడీపై వినియోగదారులు ఎన్నిసార్లు సర్కిల్ స్థాయి అధికారులకు మొరపెట్టుకున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యారని బాధితులు వాపోతున్నారు.

కంప్యూటర్ సేవా కేంద్రాల్లో

ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునే ప్రజలను ఈ నిర్వాహకులు, మధ్యవర్తులు నిలువునా దోచేస్తున్నారు. దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేయడానికి నామమాత్రపు ఫీజు తీసుకోవాల్సింది పోయి, విద్యుత్ శాఖ అధికారులకు మామూళ్లు ఇవ్వాలనే సాకుతో వేల రూపాయలు ముందస్తుగానే వసూలు చేస్తున్నారు. కనెక్షన్ కోసం అవసరమైన డాక్యుమెంట్లు, బిల్డింగ్ పర్మిషన్లు లేదా నోటరీ పత్రాలలో చిన్న చిన్న లోపాలు ఉన్నా వాటిని సరిచేసి ఇస్తామంటూ ప్రత్యేకంగా రేట్లు నిర్ణయించి దందా సాగిస్తున్నారు.

విద్యుత్ సీఎస్సీ కేంద్రాలలో నిబంధనలు తుంగలో తొక్కి సాగిస్తున్న అక్రమాలు, పటాన్‌చెరు పరిధిలో ఓ ఉన్నతాధికారికి ఎదురైన అనుభవంపై రాష్ట్ర ఇంటిలిజెన్స్ విభాగం అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించి క్షేత్రస్థాయిలో సమాచారాన్ని సేకరిస్తున్నట్లు తెలిసింది. సామాన్యుడితో పాటు ప్రభుత్వ పెద్దలకే ఈ స్థాయి చేదు అనుభవాలు ఎదురైతే, క్షేత్రస్థాయిలో పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో ప్రభుత్వానికి నివేదిక రూపంలో పంపించేందుకు సిద్ధమవుతున్నారు. 

లంచం ఇస్తేనే లైన్ క్లియర్

ఒకవేళ వినియోగదారులు నేరుగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నా, క్షేత్రస్థాయి పరిశీలనకు వచ్చేసరికి లేనిపోని కొర్రీలు పెడుతున్నారు. ‘పోల్ దూరం ఎక్కువగా ఉంది’, ‘ట్రాన్స్‌ఫార్మర్ ఓవర్ లోడ్ అయింది’, ‘అదనపు వైర్ కావా’ అంటూ దరఖాస్తుదారులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. అదే బ్రోకర్ ద్వారా అడిగినంత డబ్బులు చేతిలో పెడితే, ఏ సమస్యలు లేకుండానే 24 గంటల్లో కనెక్షన్ మంజూరైపోతుండటం ఇక్కడి వ్యవస్థ తీరుకు అద్దం పడుతోంది.

టీజీఎస్పీడీసీఎల్ పరిధిలో, ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్, పరిసర జిల్లాల్లో ఈ అవినీతి ఇంత బహిరంగంగా సాగుతున్నా విజిలెన్స్ విభాగానికి గానీ, ఉన్నతాధికారులకు గానీ పట్టకపోవడం వెనుక పెద్ద గూడుపుఠాణీ ఉందనే ఆరోపణలు వస్తున్నాయి. కిందిస్థాయి నుండి పైస్థాయి వరకు ఈ మామూళ్ల వాటాలు అందుతుండటం వల్లే ఈ అక్రమ వసూళ్లను చూసీచూడనట్లు వదిలేస్తున్నారని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఉన్నతాధికారుల చర్యలు ఇలా ఉండాలి

కొత్త విద్యుత్ కనెక్షన్ల జారీలో.. క్యూర్ పరిధిలో జరుగుతున్న ఈ దోపిడీకి అడ్డుకట్ట వేయాలంటే ప్రభుత్వం,  టీజీఎస్పీడీసీఎల్ యాజమాన్యం కఠిన చర్యలు తీసుకోవాలి. ఆన్‌లైన్ దరఖాస్తుల స్టేటస్‌ను పారదర్శకంగా పర్యవేక్షించడంతో పాటు, లంచాలు డిమాండ్ చేసే సిబ్బందిపై, అక్రమాలకు పాల్పడే సేవా కేంద్రాలపై విజిలెన్స్ దాడులు నిర్వహించి క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. సీఎస్సీ కేంద్రాల పనితీరుపై టీజీఎస్పీడీసీఎల్ ఉన్నతాధికారులు తక్షణమే ఉన్నత స్థాయి విజిలెన్స్ విచారణకు ఆదేశించాలి.

ప్రతి డివిజన్ కేంద్రంలో రోజువారీగా వచ్చిన దరఖాస్తులెన్ని, వాటిలో ఎన్నింటికి రసీదులు ఇచ్చారు, ఎన్ని దరఖాస్తులను సకాలంలో ఆన్‌లైన్ చేశారు, పెండింగులో ఉన్న వాటికి కారణాలేంటి అనే అంశాలపై ఆడిట్ నిర్వహించాలి. సీఎస్సీలలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి నిఘా పెంచడంతో పాటు, దరఖాస్తు చేసిన వెంటనే తప్పనిసరిగా రశీదు జారీ అయ్యేలా సాఫ్ట్‌వేర్‌లో మార్పులు తీసుకురావాలి. అవినీతి అధికారులపై సస్పెన్షన్ వేటు వేసి, సామాన్య వినియోగదారులకు రూపాయి ఖర్చు లేకుండా నిబంధనల ప్రకారం విద్యుత్ కనెక్షన్లు అందేలా చర్యలు తీసుకోవాలి. 

మరిన్ని వార్తలు