నేత కార్మికుల కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం ఇవ్వాలి

29-09-2026 | 02:19pm
  1. సిరిసిల్ల నేతన్నల కష్టాలను సీఎం రేవంత్‌రెడ్డి గుర్తించాలి
  2. ఉపాధి కోల్పోయి ఆత్మహత్య చేసుకున్న 35 కుటుంబాలకు అండగా నిలవాలి

రాజన్న సిరిసిల్ల 29 సెప్టెంబర్‌  (విజయక్రాంతి): సిరిసిల్ల వస్త్ర పరిశ్రమపై(Textile industry) ఆధారపడి జీవిస్తున్న నేత కార్మికులు ఉపాధి కోల్పోయి తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, కుటుంబాలను పోషించుకోలేక అనేక మంది తీవ్ర మనోవేదనకు గురవుతున్నారని కార్మిక విభాగం జిల్లా అధ్యక్షులు వెంగల శ్రీనివాస్ అన్నారు కార్మికుల ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధి లేక ఆత్మహత్యలకు పాల్పడిన 35 నేత కార్మికుల కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేశారు.

రేపు సిరిసిల్లకు రానున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేత కార్మికుల సమస్యలను ప్రత్యక్షంగా అర్థం చేసుకుని, వారి కుటుంబాలకు భరోసా కల్పించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడంతో పాటు నేతన్నలకు నిరంతర ఉపాధి కల్పించే చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు.

నేత కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను స్వాగతిస్తున్నామని పేర్కొంటూ, ప్రజలకు ఆర్థిక భరోసా కల్పించే పథకాలను క్రమబద్ధంగా అమలు చేయాలని కోరారు. రైతులు, కార్మికులు, పేద కుటుంబాల సంక్షేమానికి మరింత ప్రాధాన్యం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. సిరిసిల్ల నేతన్నల సమస్యలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి, ఉపాధి అవకాశాలు పెంచే విధంగా చర్యలు తీసుకోవాలని, ఆత్మహత్యలకు పాల్పడిన కుటుంబాలకు తక్షణ ఆర్థిక సహాయం అందించాలని వారు డిమాండ్ చేశారు. సీఎం సభ వేదికగా నేత కార్మికుల సమస్యలకు స్పష్టమైన పరిష్కార మార్గం ప్రకటించాలని కోరారు.

మరిన్ని వార్తలు