గ్రామాల అభివృద్ధే లక్ష్యం..

15-10-2026 | 04:38pm

నీరు, విద్యుత్ వృథాను అరికట్టాలి: ఎమ్మెల్యే డాక్టర్ సంజీవరెడ్డి

నాగల్‌గిద్ద, అక్టోబర్ 15 (విజయక్రాంతి): గ్రామాల సమగ్రాభివృద్ధికి సర్పంచ్‌లు ప్రత్యేక చొరవ చూపాలని నారాయణఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి(MLA Dr. Patlolla Sanjeeva Reddy) సూచించారు. గురువారం నాగల్‌గిద్ద మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశంలో ఆయన పాల్గొని వివిధ శాఖల అభివృద్ధి పనులు, ప్రజా సమస్యలపై సమీక్షించారు.

గ్రామాల్లో మహిళా సమాఖ్య భవనాల నిర్మాణాలను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. నీరు, విద్యుత్ వృథాను అరికట్టేందుకు సర్పంచ్‌లు చర్యలు చేపట్టాలని, రాబోయే రోజుల్లో నీటి కొరత తలెత్తకుండా ముందస్తు ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. వీబీ–జీ రామ్‌జీ పథకం కింద చేపట్టే 375 రకాల పనులపై సర్పంచ్‌లు అవగాహన కలిగి ఉండాలన్నారు.

గ్రామాల అవసరాలకు అనుగుణంగా సీసీ, బీటీ రోడ్ల నిర్మాణానికి ప్రాధాన్యం ఇవ్వాలని తెలిపారు. జలసిరి నిధులతో ఇంకుడు గుంతలు, సోక్‌పిట్లు, బోరు రీచార్జ్ పనులు చేపట్టి భూగర్భ జలాలను పెంపొందించాలని సూచించారు. తక్కువ నీటితో పండే పంటల సాగును ప్రోత్సహించాలని, సబ్సిడీ శనగ,కుసుమలు విత్తనాలను రైతులు సద్వినియోగం చేసుకునేలా చూడాలన్నారు.

రత్నానాయక్ తండాలో 13 ఎకరాల 19 గుంటల భూమికి సంబంధించిన వారసత్వ రిజిస్ట్రేషన్ సమస్యను పరిష్కరించాలని తహసీల్దార్ సంగ్రామ్‌రెడ్డిని ఆదేశించారు. ఔదత్‌పూర్ సర్పంచ్ సంతోష్ విద్యుత్ అంతరాయాల సమస్యను ప్రస్తావించగా, గ్రామాలవారీగా ప్రత్యేక బ్రేకర్ల ఏర్పాటుపై పరిశీలించాలని సూచించారు.

అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలన్నారు. సమావేశంలో ఆత్మ చైర్మన్ వినోద్ పటేల్, ఎంపీడీవో మహేశ్వరరావు, తహసీల్దార్ సంగ్రామ్‌రెడ్డి, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ లక్ష్మీదీపిక, సూపర్‌వైజర్ ప్రశాంతి, డాక్టర్ జువేరియా బేగం, ఏపీఎం నర్సింలు, వ్యవసాయ అధికారి ప్రవీణ్ చారి, సర్పంచ్‌లు, అధికారులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు