సమస్యలపై జనరల్ బాడీ గరంగరం
మునిపల్లి,(విజయక్రాంతి): మండల కేంద్రమైన మునిపల్లి ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీడీఓ అంజయ్య అధ్యక్షతన మండల సాధారణ సర్వ సభ్య సమావేశం నిర్వహించారు. ముందుగా ఆరోగ్య శాఖకు సంబంధించి ఎజెండాలను ఆ శాఖ సూపర్ వైజర్ చదివి వినిపించారు. అనంతరం గ్రామాల్లో నీటి సమస్య లేకుండా చూస్తున్నామని ఆర్ డబ్ల్యుఎస్ అధికారి సభకు వివరిస్తుండగా ఒక్క సారిగా సర్పంచులు నారాయణ, రాజు, ఇర్ఫాన్ పటేల్ లేచి ఎండా కాలం అయినందున నీటి సమస్యతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే మీరేం చేస్తున్నారు.
అరకొర కరెంట్ తో కనీసం తాగునీటి కోసం ప్రజలు పడరాని పాట్లు పడుతున్నారని, ప్రత్యామ్నాయంగా చేతి పంపు మోటర్లను బిగించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారిని నిలదీశారు. దీంతో మండల స్ఫెషలాఫీసర్ రామాచారి కలుగజేసుకొని ఎండాకాలంలో ప్రజలు నీటి ఎద్దడి ఇబ్బందులకు గురి కావద్దని, అందుకు ముందుస్తుగా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. ఈ ఏడాది వానాకాలంలో 40శాతం వర్షాపాతం మాత్రమే నమోదైందని, ఎల్ నినో కారణంగా ఆరు తడి పంటలపై రైతులు మొగ్గు చూపి వరి, మొక్కజొన్న పంటలను వేయొద్దని, 15మీటర్ల లోతుకు భూ గర్బ జలాలు అడుగంటాయని, డిసెంబర్ మాసం వరకు వర్షాలు వచ్చే అవకాశం లేవని ఏవో అనితారెడ్డి సభలో వివరించారు.
అలాగే ఇప్పటి వరకు 67మంది రైతు బీ మాకు రైతులు దరఖాస్తులు చేసుకుంటే అందులో 63మందికి రైతు భీమా ఇవ్వడం జరిగిందని తెలిపారు. ముఖ్యంగా రైతులుఫార్మ రిజిస్ట్రేషన్ తప్పని సరిగా చేయించుకోవాలని వివరించగా.. ప్రస్తుతం పత్తి చేతికొచ్చి పత్తి తీత పనులు ప్రారంభం కావడంతో పత్తిఎవరికి అమ్ముకోవాలో రైతులకు అర్థం కావడం లేదని, ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర కంటే ప్రైవేట్ లో అధిక ధర ఉందని ఏవో అనితారెడ్డిని పెద్దగోపులారం గ్రామ సర్పంచ్ బుడ్డ మల్లేశం ప్రశ్నించగా.. ఈసారి సీసీఐ ఉంటుందో ఉండదో ఇంకా క్లారిటీ లేదని సమాధానం చెప్పారు. ముఖ్యంగా రైతులు ఆయిల్ ఫాంపై అవగాహ కల్పించాలని అధికారులు సభలో నిర్ణయించారు. ఈ సమావేశంలో ఎమ్మార్వో రంగారావు, ఐసీడీఎస్ సూపర్ వైజర్ శైలజ, ఏపీఎం నర్సింలు, ఏపీఓ యాదగిరి, ఆయా శాఖల అధికారులు, సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.