రైతు ఆత్మహత్యకు కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యమే కారణం

15-10-2026 | 09:00pm
  1. తెలంగాణ రక్షణ సేన నియోజకవర్గ అధ్యక్షులు  దండే అపర్ణ
  2. సాగునీరు, సరైన విద్యుత్ లేక పంటలు ఎండిపోయి అప్పులప పాలైన యువ రైతు

శివంపేట  అక్టోబర్ 15 (విజయక్రాంతి ): వర్షాలు లేక, కాలానికి తగినట్లుగా సరైన విద్యుత్ సరఫరా అందక పంటలు ఎండిపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురై అప్పుల భారం తాళలేక బలవన్మరణానికి పాల్పడిన యువ రైతు మాలోత్ శంకర్ (45) కుటుంబాన్ని తెరాస (తెలంగాణ రక్షణ సేన) పార్టీ(Telangana Rakshana Sena Party) నర్సాపూర్ నియోజకవర్గ అధ్యక్షురాలు, నర్సాపూర్ మొదటి శాసనసభ్యుడు గుండం వీరయ్య గారి మనమరాలు దండే అపర్ణ గురువారం రోజున పరామర్శించారు.

శివంపేట మండలం భీమ్లా తండా గ్రామ పరిధిలోని శంకర్ తండాకు చెందిన రైతు మాలోత్ శంకర్ ఆత్మహత్య చేసుకున్నాడనే వార్త తెలుసుకున్న దండే అపర్ణ గారు హుటాహుటిన శంకర్ తండాకు చేరుకుని బాధిత కుటుంబ సభ్యులను కలిశారు. ఈ సందర్భంగా వారిని ఓదార్చి, కొండంత ధైర్యం చెప్పడమే కాకుండా ఆ కుటుంబానికి తక్షణ సహాయంగా ఆర్థిక సాయం అందజేశారు.

ఈ సందర్భంగా దండే అపర్ణ మాట్లాడుతూ..రైతు మాలోత్ శంకర్ ఆత్మహత్యకు ముమ్మాటికీ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యమే కారణం. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సరైన విద్యుత్ సరఫరా లేక, సాగునీరు అందక పంటలు ఎండిపోయి రైతులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. అప్పుల ఊబిలో కూరుకుపోయి కంటిమీద కునుకు లేక, చివరకు రైతన్నలు ఆత్మహత్యల బాట పడుతుంటే ఈ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లువ్యవహరిస్తోంది."

రైతాంగాన్ని ఆదుకోవడంలో పూర్తిగా విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే మేల్కొని, మరణించిన రైతు మాలోత్ శంకర్ కుటుంబాన్ని ప్రభుత్వ పరంగా రూ. 10 లక్షల పరిహారం ఇచ్చి ఆదుకోవాలని, అలాగే ఎండిపోయిన పంటలకు నష్టపరిహారం చెల్లించాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక తెరాస (తెలంగాణ రక్షణ సేన) పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు