మర్పడగ క్షేత్రంలో హరీశ్‌రావు పూజలు
శరన్నవరాత్రి ఉత్సవాల్లో అమ్మవారిని దర్శించుకున్న మాజీ మంత్రి
కొండపాక, అక్టోబరు 15: కొండపాక మండలం మర్పడగ గ్రామంలోని విజయదుర్గా సమేత సంతాన మల్లికార్జున స్వామి క్షేత్రాన్ని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే టి. హరీశ్‌రావు(Former Minister Harish Rao) గురువారం సాయంత్రం దర్శించుకున్నారు. క్షేత్రంలో వైభవంగా కొనసాగుతున్న దేవి శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా అమ్మవారి కృపాకటాక్షాలతో సమస్త లోకాలు సుభిక్షంగా ఉండాలని, ప్రజలందరూ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు, శాంతిసౌభాగ్యాలతో వర్ధిల్లాలని హరీశ్‌రావు భక్తిశ్రద్ధలతో ప్రార్థించారు. శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఆలయంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొనగా, భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
అనంతరం క్షేత్ర నిర్వాహకులు చెప్పెల హరినాథ్ శర్మ హరీశ్‌రావుకు స్వాగతం పలికారు. ఆలయ సంప్రదాయాల ప్రకారం పూజలు నిర్వహించి, శేషవస్త్రంతో సత్కరించారు. అంతకుముందు మర్పడగ గ్రామంలోని పోచమ్మ దేవాలయ పునర్నిర్మాణ పనుల సందర్భంగా హరీశ్‌రావు కొబ్బరికాయ కొట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో గజ్వేల్ బీఆర్ఎస్ నాయకులు వంటేరు ప్రతాపరెడ్డి, రాజనర్సు, సంపత్‌రెడ్డి, అనంతుల ప్రశాంత్, నూనె కుమార్, రాగల దుర్గయ్య, నరసింహారెడ్డి, గ్రామ సర్పంచ్ ఆకారం బాలరాజుతో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.