ఐలాపూర్ తండాలో అక్రమ కట్టడాల కూల్చివేత
అమీన్పూర్, నవంబర్ 21 (విజయక్రాంతి): హైదరాబాద్ మహానగరానికి ఆనుకుని ఉన్న సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం ఐలాపూర్ తండాలో ప్రభుత్వ భూముల ఆక్రమణలు, అక్రమ నిర్మాణాలపై రెవెన్యూ అధికారులు కొరడా ఝళిపించారు. గతంలో హైడ్రా (HYDRAA), స్థానిక రెవెన్యూ అధికారులు భారీ స్థాయిలో కూల్చివేతలు చేపట్టి వందలాది ఎకరాల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకున్నప్పటికీ, తిరిగి అక్రమ నిర్మాణాలు వెలుస్తుండటం ఆందోళన కలిగిస్తోంది.
తాజాగా శనివారం ఐలాపూర్ తండాలోని సర్వే నంబర్ 119లో వెలిసిన అక్రమ నిర్మాణాలపై తహసీల్దార్ వెంకటేశం ఆధ్వర్యంలో అధికారులు చర్యలు చేపట్టారు. జేసీబీల (JCB Machines) సహాయంతో 15 ఇళ్లను, కొత్తగా నిర్మించిన 50 బేస్మెంట్లను కూల్చివేశారు. బోర్వాటర్ను నిల్వ చేసి ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తున్న బోర్లను సైతం మూసివేసినట్లు అధికారులు తెలిపారు.
అత్యంత విలువైన ప్రభుత్వ భూములు, చెరువుల శిఖం, బఫర్‌జోన్ పరిధుల్లో కొందరు ఎలాంటి అనుమతులు లేకుండానే రాత్రికి రాత్రే షెడ్లు, ప్రహరీ గోడలు, భవనాలు నిర్మిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అమీన్పూర్ పరిధిలోని పలు సర్వే నంబర్లలో అధికారులు ఎప్పటికప్పుడు కూల్చివేతలు చేపడుతున్నప్పటికీ, పర్యవేక్షణ లోపంతో మళ్లీ ఆక్రమణలు జరుగుతున్నాయి. అక్రమ లేఅవుట్లు, అనుమతులు లేని బహుళ అంతస్తుల భవనాలను తక్కువ ధరలకు ఆశచూపి కొందరు బిల్డర్లు సామాన్యులకు విక్రయిస్తున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తీరా కూల్చివేతలు జరిగినప్పుడు మధ్యతరగతి కుటుంబాలు కష్టార్జితాన్ని కోల్పోయి ఇబ్బందులు పడుతున్నాయి.
ప్రభుత్వ భూముల పరిరక్షణకు ప్రత్యేక బృందాలు, మున్సిపల్, రెవెన్యూ అధికారులు సమన్వయంతో పనిచేయాలని స్థానికులు కోరుతున్నారు. ఆక్రమణలు పునాది దశలోనే అడ్డుకోవాలని, ప్రభుత్వ భూముల చుట్టూ పటిష్టమైన కంచె ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కేవలం నోటీసులు, కూల్చివేతలకే పరిమితం కాకుండా కబ్జాదారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కోరుతున్నారు.
ఈ సందర్భంగా తహసీల్దార్ వెంకటేశం మాట్లాడుతూ.. అమీన్పూర్ పరిధిలోని ప్రభుత్వ భూములను ఎవరైనా ఆక్రమిస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ఇప్పటికే హైడ్రా చర్యలు చేపట్టి ప్రభుత్వ భూములను కాపాడిందని, అయినప్పటికీ కొందరు అక్రమార్కులు రాత్రికి రాత్రే నిర్మాణాలు చేపడుతున్నారని తెలిపారు. ఇలాంటి చర్యలను ఎప్పటికప్పుడు అడ్డుకుంటున్నామని, ఆక్రమణలకు పాల్పడిన వారిపై కూల్చివేతలతో పాటు క్రిమినల్ కేసులు (Criminal Cases) నమోదు చేస్తామని స్పష్టం చేశారు. సర్వే నంబర్ 119లో మొత్తం 429 ఎకరాల భూమి ఉండగా, అందులో సుమారు 30 ఎకరాల వరకు ఆక్రమణలకు గురైందని వెల్లడించారు. మిగిలిన భూమిలో ఎలాంటి ఆక్రమణలు జరగకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు.