పారిశుద్ధ్య కార్మికులకు లయన్స్ క్లబ్ ఆపన్నహస్తం
నాగల్గిద్ద, అక్టోబర్ 14 (విజయక్రాంతి): నాగల్గిద్ద మండలంలోని శేరి దామరగిద్ద గ్రామంలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులకు(Gram Panchayat sanitation workers) దుస్తులు పంపిణీ చేశారు. బాంబే కట్పీస్ యజమాని సౌజన్యంతో నిర్వహించిన ఈ సేవా కార్యక్రమంలో కార్మికులకు దుస్తుల ప్యాకెట్లను అందజేశారు.
ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ రాజు మాట్లాడుతూ గ్రామాన్ని నిత్యం పరిశుభ్రంగా ఉంచడంలో పారిశుద్ధ్య కార్మికుల పాత్ర ఎంతో కీలకమన్నారు. ఎండనక, వాననక ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం శ్రమిస్తున్న కార్మికుల సేవలను గుర్తించి వారికి చేయూతనందించడం అభినందనీయమని పేర్కొన్నారు. సమాజ సేవలో భాగంగా ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని చేపట్టాలని ఆకాంక్షించారు.
కార్మికులకు దుస్తులు అందించిన లయన్స్ క్లబ్ ప్రతినిధులకు, బాంబే కట్పీస్ యజమానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ రాజు, ఉపసర్పంచ్ పండరీనాథ్, లయన్స్ క్లబ్ సభ్యులు, గ్రామ పంచాయతీ కార్మికులు, గ్రామస్తులు పాల్గొన్నారు.