బాన్సువాడలో అగ్నిప్రమాదం...గడ్డివాము దగ్ధం
రూ.50 వేల ఆస్తి నష్టo...
టపాకాయల నిప్పురవ్వలతో ప్రమాదం...
బాన్సువాడ, నవంబర్ 9 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా(Kamareddy District) బాన్సువాడ పట్టణంలోని మదీనా కాలనీలో అగ్నిప్రమాదం(Fire accident) చోటుచేసుకుంది. టపాకాయల నిప్పురవ్వలు గడ్డివాముపై(Haystack) పడటంతో మంటలు చెలరేగి కాలనీకి చెందిన ఖమ్రు అనే వ్యక్తి గడ్డివాము పూర్తిగా దగ్ధమైంది. ఈ ప్రమాదంలో సుమారు రూ.50 వేల విలువైన ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం. అగ్నిప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం అందించారు.
ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ ఇంజన్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. దీంతో మంటలు ఇతర ప్రాంతాలకు వ్యాపించకుండా నివారించారు. టపాకాయలు కాల్చే సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా గడ్డివాములు, పశువుల పాకలు, ఇళ్ల సమీపంలో టపాకాయలు కాల్చకుండా జాగ్రత్తలు తీసుకోవాలని స్థానికులు సూచిస్తున్నారు.