విద్యుత్ కోతలతో ఎండుతున్న పంటలు

10-10-2026 | 06:31pm

రైతన్నల్ల కన్నీటి ఆవేదన!

చేతికందే దశలో వరి పంట ఎండిపోవడంతో నిరసన

చేర్యాల, అక్టోబర్ 10: లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి పంట సాగు(Crop Cultivation) చేస్తే.. తీరా చేతికందే సమయంలో నీళ్లు లేక పంట ఎండిపోవడంతో రైతులు(Farmers) కన్నీటిపర్యంతమవుతున్నారు. విద్యుత్ సరఫరా(Power supply) సక్రమంగా లేక వరి చేను ఎండిపోవడంతో ఆవేదన చెందిన రైతులు శనివారం మండలంలోని ఆకునూరు గ్రామంలో(Akunuru Village) ఎండిపోయిన వరి పొలంలో(Paddy field) ఎడ్లను మేపుతూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా బాధిత రైతు కంతుల నర్సయ్య మాట్లాడుతూ..పది ఎకరాల భూమిని కౌలుకు తీసుకొని లక్షల రూపాయలు అప్పులు చేసి వరి పంట సాగు చేశానని, చేతికందే దశలో విద్యుత్ సరఫరా సక్రమంగా లేక నీరు అందక పంట పూర్తిగా ఎండిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.

పంట కోసం పెట్టిన పెట్టుబడులు నీళ్లపాలయ్యాయని, ఇప్పుడు అప్పులు ఎలా తీర్చాలో అర్థం కావడం లేదని కన్నీటి పర్యంతమయ్యారు.రైతులు పంటలు పండించేందుకు అహర్నిశలు శ్రమిస్తుంటే విద్యుత్ కోతలు వారి ఆశలను ఆవిరి చేస్తున్నాయని బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం, విద్యుత్ అధికారులు వెంటనే స్పందించి కనీసం 15 గంటలైనా నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేసి తమను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.కార్యక్రమంలో రైతులు శెట్టె మల్లయ్య, సందబోయిన వెంకటేష్, పస్తం మల్లేష్, కనకయ్య, రాములు, రాజు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు