అధిక సాంద్రత పత్తి సాగు పద్ధతిపై రైతులకు శిక్షణ
కొండపాక,(విజయక్రాంతి): కొండపాక మండలం అంకిరెడ్డిపల్లి గ్రామంలో శనివారం అధిక సాంద్రత పత్తి సాగు విధానంపై శిక్షణ, క్షేత్ర ప్రదర్శన నిర్వహించారు. గజ్వేల్ వ్యవసాయ సహాయ సంచాలకులు ఎల్. బాబు నాయక్ మాట్లాడుతూ అధిక సాంద్రత పత్తి సాగుతో ఒకేసారి దిగుబడి పొందడంతో పాటు కూలీల ఖర్చు తగ్గి, రెండో పంట సాగుకు ఎక్కువ సమయం లభిస్తుందని తెలిపారు. రైతులు ఈ విధానాన్ని అనుసరించి అధిక లాభాలు పొందాలని సూచించారు.
అదేవిధంగా ఖేత్ బచావో అభియాన్లో భాగంగా రైతులకు భూసంరక్షణ, నీటి పొదుపుపై అవగాహన కల్పించారు. ఎల్నినో పరిస్థితుల నేపథ్యంలో సమతుల్య ఎరువుల వినియోగం, పంట అవశేషాలను కాల్చకుండా నేల సారాన్ని కాపాడుకోవాలని వ్యవసాయ అధికారులు సూచించారు. వరి సాగు తగ్గించి పప్పు దినుసులు, నూనె గింజలు, కూరగాయల వంటి తక్కువ నీటితో పండే పంటలను సాగు చేయాలని కోరారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గంగాధర్, మండల వ్యవసాయ అధికారి శివరామకృష్ణ,వ్యవసాయ విస్తరణ అధికారి, నూజివీడు, రాశి విత్తన కంపెనీల ప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.