సీఎం సభ తర్వాతే నామినేటెడ్ పదవులు?

27-10-2026 | 05:25am

అధికారంలోకి వచ్చి ఇన్నాళ్లయినా నియామకాలేవీ?

సిద్దిపేట, అక్టోబర్ 26 (విజయక్రాంతి): అధికారం వచ్చింది.. కానీ పదవులు మాత్రం దక్కడం లేదు! పార్టీ కోసం ఏళ్ల తరబడి పనిచేసిన నాయకులు, కార్యకర్తలకు గుర్తింపు కరువైందన్న అసంతృప్తి సిద్దిపేట కాంగ్రెస్లో(Siddipet Congress) అంతకంతకూ పెరుగుతోంది. రాష్ట్రంలో కాంగ్రెస్(Congress) అధికారంలోకి వచ్చినప్పటికీ సిద్దిపేట నియోజకవర్గంలో(Siddipet Constituency) కీలక నామినేటెడ్ పదవుల భర్తీ జరగకపోవడంపై పార్టీ శ్రేణులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నాయి. ఎన్నికల సమయంలో పార్టీ కోసం పనిచేసిన వారికి అధికారంలోకి వచ్చాక కూడా అవకాశాలు కల్పించకపోతే ఎలా అన్న ప్రశ్నలు అంతర్గతంగా వినిపిస్తున్నాయి.

పదవులివ్వలేని నాయకత్వం ఎందుకు?

జిల్లా, నియోజకవర్గ స్థాయి నాయకత్వం నామినేటెడ్ పదవుల భర్తీ(Filling of nominated posts) విషయంలో చొర వ చూపడం లేదన్న విమర్శలు సీనియర్ నా యకుల నుంచి వ్యక్తమవుతున్నాయి. ఎన్నిక ల్లో పోటీ చేసిన వారికి నియోజకవర్గ బాధ్యతలు అప్పగించినప్పటికీ, పార్టీ కోసం పని చేసిన కార్యకర్తలకు పదవులు ఇప్పించడంలో వారు విఫలమయ్యారన్న అసంతృప్తి నెలకొ ంది. అందరికీ ఒకేసారి పదవులు ఇవ్వలేకపోయినా, దశలవారీగా అవకాశాలు కల్పించి ఉంటే చాలామందికి న్యాయం జరిగేదని నా యకులు అభిప్రాయపడుతున్నారు.

సిద్దిపేటలో ‘నిల్’.. ఇతర చోట్ల భర్తీ!

జిల్లాలోని హుస్నాబాద్, గజ్వేల్, దుబ్బాక నియోజకవర్గాల్లో మార్కెట్ కమిటీలు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు నియామకాలు జరిగినప్పటికీ, సిద్దిపేట నియోజకవర్గంలో మాత్రం ఆ స్థాయిలో పదవుల భర్తీ జరగలేదన్న విమర్శలు వినిపి స్తున్నాయి.  గ్రంథాలయ సంస్థ చైర్మన్, ఆత్మ కమిటీ పదవి మినహా కీలక నామినేటెడ్ పో స్టులు ఖాళీగా ఉండటంతో ఆశావహులు నిరాశకు గురవుతున్నారు.

మార్కెట్ కమిటీలు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, దేవాలయాల పాలకవర్గాలు, ఆసుపత్రి అభివృద్ధి కమిటీల్లో పదవుల కోసం ఎదురుచూస్తున్న నాయకుల సంఖ్య పెరుగుతోంది. మరోవైపు సిద్దిపేట అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (సుడా) పదవిపై కూడా పోటీ నెలకొందన్న చర్చ సాగుతోంది. ఈ పదవిని స్థానికంగా పార్టీ కోసం పనిచేసిన నాయకులకే కేటాయించాలని కార్యకర్తలు కోరుతున్నారు.

సీఎం సభ తర్వాతే పదవుల పందేరమా?

దీపావళిలోపు రాష్ట్రస్థాయిలో నామినేటెడ్ పదవుల భర్తీ జరిగే అవకాశం ఉందన్న చర్చ కాంగ్రెస్ వర్గాల్లో సాగుతోంది. సిద్దిపేటలో ముఖ్యమంత్రి బహిరంగ సభ అనంతరం నియామకాలపై నిర్ణయం తీసుకోవచ్చన్న ప్రచారం కూడా వినిపిస్తోంది. అయితే దీనిపై అధికారిక స్పష్టత లేదు.

పదవుల కోసం ఎదురుచూస్తూ నిరాశకు గురైన కొందరు నాయకులు పార్టీ కార్యక్రమాలకు దూరమవుతున్నారన్న చర్చ పార్టీ శ్రేణుల్లో ఆందోళన కలిగిస్తోంది. మరికొందరు రాష్ట్రస్థాయి నాయకుల ద్వారా అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నారు.

పార్టీని నమ్ముకున్న కార్యకర్తలకు గుర్తింపు ఇవ్వకపోతే, అధికారంలో ఉన్నా ప్రయోజనమేమిటన్న ప్రశ్న ఇప్పుడు సిద్దిపేట కాంగ్రెస్ను వేధిస్తోంది. ఇప్పటికైనా జిల్లా, నియోజకవర్గ నాయకత్వం స్పందించి పదవుల భర్తీపై స్పష్టమైన కార్యాచరణ ప్రకటించాలని కార్యకర్తలు కోరుతున్నారు. జాప్యం మరింత కొనసాగితే పార్టీ శ్రేణుల్లో అసంతృప్తి పెరిగి, భవిష్యత్తులో పార్టీ బలోపేతంపై ప్రభావం చూపే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.

మరిన్ని వార్తలు