ఐపీఎల్ వేలంలోకి సెహ్వాగ్ కొడుకు.. బేస్ ప్రైస్ ఎంతంటే?
ఐపీఎల్ 2027 మినీ వేలానికి(IPL 2027 Mini-Auction) రంగం సిద్ధమవుతోంది. ఈసారి వేలంలో పలువురు యువ క్రికెటర్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. భారత మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తనయుడు(Virender Sehwag Son) ఆర్యవీర్ సెహ్వాగ్(Aaryavir Sehwag) కూడా వేలం బరిలోకి దిగేందుకు పేరు నమోదు చేసుకున్నాడు. ఇటీవల జరిగిన అండర్-19 ఆసియా కప్(Under-19 Asia Cup)లో సత్తా చాటి ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్‌గా నిలిచిన ఆర్యవీర్.. తన కనీస ధరను రూ.30 లక్షలుగా నిర్ణయించుకున్నాడు.
ఆసియా కప్ హీరోల ఎంట్రీ..
అండర్-19 ఆసియా కప్‌లో పాకిస్థాన్‌తో జరిగిన ఫైనల్‌లో భారత్ విజయంలో కీలక పాత్ర పోషించిన మోహిత్ ఉల్వా(Mohit Ulva) కూడా వేలం జాబితాలో చోటు దక్కించుకున్నాడు. మరో యువ ఆటగాడు కావ్యన్ పటేల్ సైతం తన పేరును నమోదు చేసుకున్నాడు. వీరు కూడా రూ.30 లక్షల బేస్ ప్రైస్‌తో వేలానికి సిద్ధమయ్యారు. అయితే, ఆసియా కప్ జట్టు కెప్టెన్ లక్ష్య రాయ్‌చందాని, రాహుల్ ద్రవిడ్ తనయుడు అన్వయ్ ద్రవిడ్, మానల్ చౌహాన్ ఈసారి వేలానికి దూరంగా ఉన్నారు.
వార్నర్, నిఖిల్ చౌదరి కూడా..
మరోవైపు ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ డేవిడ్ వార్నర్ రూ.2 కోట్ల కనీస ధరతో వేలానికి తన పేరును నమోదు చేసుకున్నాడు. భారత సంతతికి చెందిన ఆస్ట్రేలియా క్రికెటర్ నిఖిల్ చౌదరి, ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్ సోనీ బేకర్ కూడా ఈ జాబితాలో ఉన్నారు. బ్రిటిష్ పౌరసత్వం పొందిన పాకిస్థాన్ మాజీ పేసర్ మహమ్మద్ అమీర్ మాత్రం వేలం కోసం పేరు నమోదు చేసుకోలేదు.
సగం సీజన్‌కే జై రిచర్డ్‌సన్..
ఆస్ట్రేలియా పేసర్ జై రిచర్డ్‌సన్ రూ.2 కోట్ల బేస్ ప్రైస్‌తో వేలంలోకి రానున్నాడు. అయితే, అతను సీజన్‌లో 50 శాతం మ్యాచ్‌లకు మాత్రమే అందుబాటులో ఉంటాడు. మరోవైపు స్కాట్ బోలాండ్ తన పేరును ఉపసంహరించుకున్నాడు. మిచెల్ స్టార్క్, ట్రావిస్ హెడ్ కూడా ఈ సీజన్‌కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. కాగా, ఐపీఎల్ 2027 మినీ వేలం డిసెంబర్ 16న గోవాలో జరగనుంది. ఆటగాళ్ల పేర్ల నమోదు మాత్రమే వేలంలో తుది అవకాశం కల్పించదు. ఫ్రాంచైజీల ఆసక్తి ఆధారంగా తుది జాబితాలో చోటు దక్కనుంది.