కుటుంబ కలహాలతో బీహార్ కార్మికుడి ఆత్మహత్య
నేరేడుచర్ల, నవంబర్ 11(విజయ క్రాంతి): కుటుంబ కలహాలతో మనస్తాపానికి గురైన బీహార్‌కు(Bihar) చెందిన ఓ యువకుడు ఆత్మహత్యకు (Suicide) పాల్పడి మృతి చెందిన ఘటన మండలంలోని దిర్సించర్ల గ్రామంలో చోటుచేసుకుంది.ఎస్సై గోపాల్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... బీహార్ రాష్ట్రానికి చెందిన రామ్ దయాల్ కుమార్ (26) దిర్సించర్ల గ్రామంలోని సాయి హనుమాన్ రైస్‌మిల్‌లో హమాలీగా పనిచేస్తున్నాడు.
కాగా, మంగళవారం రాత్రి బీహార్‌లో ఉన్న అతని కుటుంబ సభ్యులు ఫోన్ చేయడంతో కుటుంబ విషయాలపై ఫోన్‌లో వాగ్వాదం జరిగినట్లు సమాచారం. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన రామ్ దయాల్ కుమార్ రాత్రి 10 గంటల సమయంలో కనిపించకుండా పోయాడు.
దీంతో అప్రమత్తమైన తోటి బీహార్ కార్మికులు అతని కోసం వెతకగా, రైస్‌మిల్ సమీపంలోని పొలాల్లో ఓ కంప చెట్టుకు ఉరివేసుకున్న స్థితిలో కనిపించాడు. వెంటనే సుధీర్ మాతం, బీహార్‌కు చెందిన సంతోష్ పాశ్వన్ తదితరులు కలిసి అతడిని కిందకు దించి, గదికి తీసుకువెళ్లి పడుకోబెట్టారు. అనంతరం మిల్లు గుమస్తా పసుపుల దీవన్ రాజ్‌కు సమాచారం అందించగా,
ఆయన అక్కడికి చేరుకుని 108 అంబులెన్స్‌కు సమాచారం ఇచ్చారు.అంబులెన్స్‌లో రామ్ దయాల్ కుమార్‌ను మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రికి తరలించగా, పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతుడి బాబాయి సుధీర్ మాతం ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.