ఉన్నత చదువులతోనే ఉజ్వల భవిష్యత్తు
పదో తరగతి విద్యార్థులకు వివిధ రంగాల్లో విద్య, ఉపాధి అవకాశాలపై దిశానిర్దేశం
గరిడేపల్లి, నవంబర్ 13,(విజయక్రాంతి) : మండలంలోని గడ్డిపల్లి కృషి విజ్ఞాన కేంద్రం(Krishi Vigyan Kendra, Gaddipalli) ఆధ్వర్యంలో గ్రామీణ వ్యవసాయ అనుభవ కార్యక్రమంలో(Rural Agricultural Experience Programme) భాగంగా కీతవారిగూడెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 9, 10వ తరగతి విద్యార్థులకు(Students') ఉన్నత విద్య, భవిష్యత్తు అవకాశాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఏలూరులోని సీహెచ్ఎస్డీ సెయింట్ థెరిస్సా మహిళా కళాశాలకు చెందిన బీఎస్సీ వ్యవసాయ శాస్త్రం చివరి సంవత్సరం విద్యార్థినులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా పదో తరగతి అనంతరం ఎంచుకోగల వివిధ కోర్సులు, విద్యా మార్గాలు, ఉద్యోగ అవకాశాల గురించి వివరించారు. వ్యవసాయ, వైద్య, ఇంజినీరింగ్, నర్సింగ్, ఉపాధ్యాయ విద్య తదితర రంగాల్లో ఉన్నత విద్య ద్వారా లభించే అవకాశాలను తెలియజేశారు. విద్యార్థులు తమ ఆసక్తి, అభిరుచి, సామర్థ్యాలకు అనుగుణంగా లక్ష్యాలను నిర్దేశించుకుని చదువులో రాణించాలని సూచించారు.
ముఖ్యంగా ఆర్థిక, ఇతర కారణాలతో మధ్యలోనే చదువు మానేయకుండా ఉన్నత విద్యను అభ్యసించాలని ప్రోత్సహించారు.విద్య కేవలం ఉద్యోగం పొందడానికే కాకుండా వ్యక్తిత్వ వికాసం, ఆత్మవిశ్వాసం, సామాజిక బాధ్యతను పెంపొందించడానికి కూడా దోహదపడుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సువర్ణ, ఇన్ఛార్జ్ ఏ. వెంకట ప్రసాద్, ఉపాధ్యాయులు నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.