జిల్లాలో ప్రతి గ్రామంలో ఉపాధి పనులు నిర్వహించాలి
- వేసవిలో తాగునీటి ఎద్దడి రాకుండా ముందస్తు చర్యలు
- వెనుకబడిన గ్రామాలపై ప్రత్యేక దృష్టి
- సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్
హుజూర్ నగర్, నవంబర్ 26: జిల్లాలోని ప్రతి గ్రామంలో ఉపాధి హామీ పనులు చేపట్టి కూలీలకు పని కల్పించాలని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్(District Collector Tejas Nandlal Pawar) అధికారులను ఆదేశించారు. గురువారం హుజూర్‌నగర్‌లోని మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవోలు,ఎంపీవోలు, ఏపీవోలు, సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించి మాట్లాడారు.
సూర్యాపేట జిల్లాలోని అన్ని మండలాలు కరువు ప్రభావిత ప్రాంతాలుగా ప్రకటించిన నేపథ్యంలో ప్రజలకు ఉపాధి కల్పించడంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు.ప్రతి గ్రామంలో పనుల జాబితా సిద్ధంగా ఉండాలని, రోజూ ఉపాధి పనులు జరిగేలా చూడాలని సూచించారు. పని చేసే ప్రతి కూలీకి రోజుకు కనీసం రూ.300 ఆదాయం వచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఉపాధి పనులపై కూలీల సమీకరణ సరిగా లేదని కొన్ని గ్రామాల నివేదికలు స్పష్టం చేస్తున్నాయని పేర్కొన్నారు. కూలీల హాజరు, పనుల నిర్వహణ క్షేత్రస్థాయిలో కనిపించాలని స్పష్టం చేశారు.
వెనుకబడిన గ్రామాలపై ప్రత్యేక దృష్టి
ఉపాధి పనుల్లో వెనుకబడిన గ్రామాలు, మండలాలపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ సూచించారు. గ్రామపంచాయతీల వారీగా, మండలాల వారీగా పురోగతిని సమీక్షించి నివేదికలు అందించాలని డీపీఓను ఆదేశించారు. అధికారులు బాధ్యతగా పనిచేసి ప్రజలకు అవసరమైన సమయంలో ఉపాధి కల్పించాలని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి యాదగిరి,ఆర్డిఓ శ్రీనివాసులు, ఎంపీడీవో సుమంత్ రెడ్డి,తహసిల్దార్ హరిప్రసాద్,పంచాయతీ కార్యదర్శులు,పాల్గొన్నారు.