ఆధ్యాత్మిక ప్రవచనాలను విమర్శించడం బీఆర్ఎస్ దిగజారుడు రాజకీయాలకు నిదర్శనం

04-11-2026 | 05:28pm
  1. గుంతల రోడ్లు, కూలిన వంతెనలు మీ పాలనలో జరిగిన అభివృద్ధికి నిదర్శనమా
  2. మంథని నియోజకవర్గంలో బీఆర్ఎస్ నేతల తీరుపై మార్కెట్ కమిటీ చైర్మన్ కుడుదల వెంకన్న ఆగ్రహం

మంథని, నవంబర్ 04 (విజయక్రాంతి): యువతలో నైతిక విలువలు, ప్రజల్లో మానవతా దృక్పథం పెంపొందించేందుకు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు(Minister Duddilla Sridhar Babu) ఆధ్వర్యంలో దత్తపీఠాధిపతి గణపతి సచ్చిదానంద స్వామీజీ(Ganapathy Sachchidananda Swamiji, Head of the Datta Peetham) ప్రవచన కార్యక్రమాలు నిర్వహిస్తే వాటిని కూడా రాజకీయ విమర్శలకు వాడుకోవడం బీఆర్ఎస్ నాయకుల దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని మంథని మార్కెట్ కమిటీ చైర్మన్ కుడుదల వెంకన్న మండిపడ్డారు. 

బుధవారం మంథని వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా భక్తులు దైవస్వరూపంగా భావించే సచ్చిదానంద స్వామీజీపై అసత్య ఆరోపణలు చేయడం మానుకోవాలని బీఆర్ఎస్ నేతలకు హితవు పలికారు. మంథని ప్రజలతో పాటు రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని మంత్రి శ్రీధర్‌బాబు ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తుంటే బీఆర్ఎస్ నాయకులకు వచ్చిన ఇబ్బంది ఏమిటని ప్రశ్నించారు. ప్రతి అంశాన్ని రాజకీయం చేయడం తగదన్నారు.

బీఆర్ఎస్ పాలనలో మంథని, ముత్తారం మండలంలో ఇసుక రీచ్‌ల పేరుతో రహదారులు తీవ్రంగా దెబ్బతిన్నాయని, భారీ లారీల రాకపోకలతో రోడ్లు గుంతలమయమై ప్రజలు ఇబ్బందులు పడ్డారని విమర్శించారు. ఆ రహదారులకు మరమ్మతులు చేయించి ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చిన ఘనత మంత్రి శ్రీధర్‌బాబుదేనని పేర్కొన్నారు.

ఓడేడు వద్ద నిర్మాణ దశలోనే దెబ్బతిన్న వంతెన విషయంలోనూ గత పాలకులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కోట్లాది రూపాయల ప్రజాధనం ఖర్చు చేసినా వంతెన కూలిపోయే పరిస్థితి రావడం వారి పాలనలోని అవినీతి, నాణ్యతా లోపాలకు నిదర్శనమని ఆరోపించారు.

ఇసుక అక్రమ రవాణా, కమీషన్ల వ్యవహారాలను అడ్డుకుంటున్నారనే అక్కసుతోనే మంత్రి శ్రీధర్‌బాబుపై బీఆర్ఎస్ నాయకులు విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. అభివృద్ధి, ఆధ్యాత్మికత, మానవతా విలువలను ప్రోత్సహించే కార్యక్రమాలను స్వాగతించాల్సింది పోయి విమర్శించడం సరికాదన్నారు. ఇప్పటికైనా బీఆర్ఎస్ నాయకులు నీచ రాజకీయాలు మానుకోవాలని, లేనిపక్షంలో ప్రజలే తగిన బుద్ధి చెబుతారని కుడుదల వెంకన్న హెచ్చరించారు.

మరిన్ని వార్తలు