మురసు తుఫాను ప్రభావంతో నీటమునిగిన ఇళ్ళు

04-11-2026 | 05:25pm

పలు రహదారులు జలదిగ్బంధం

పొంగిపొర్లుతున్న వాగులు, చెరువులు

దమ్మపేట పేరంటాళ్ళ చెరువుకు భారీ గండి

నీటమునిగిన వరిపొలాలు

వర్షాలు తగ్గేవరకు ఇళ్ళలోనే వుండాలని అధికారుల సూచన

దమ్మపేట, నవంబర్ 04 (విజయక్రాంతి): మురసు తుఫాను(Murusu Cyclone) ప్రభావంతో దమ్మపేట మండలంలో 48 గంటలుగా భారీ వర్షం దంచికొట్టింది. క్లౌడ్ బరస్ట్ జరిగిందా అన్నంతగా భారీ వర్షపాతం నమోదయింది. దమ్మపేటలోని పేరంటాళ్ళ చెరువు పూర్తిగా నిండిపోయి అతిపురాతన శివాలయం నీట మునిగింది.

పేరంటాళ్ళ చెరువు అలుగు కాలువకు రెండు చోట్ల భారీ ఎత్తున గండిపడి వరద నీరు పంట పొలాలపై ప్రవహిస్తుండడంతో కోతకు వచ్చిన వరి పొలాలు నీటమునిగాయి. కోతకు వచ్చిన పంట పొలాలు మునగడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరో రెండు రోజుల్లో వరి కోతకు సిద్ధమవుతుండగా మురసు తుఫాను మమ్మల్ని ఆర్ధికంగా కోలుకోనివ్వకుండా చేసిందని రైతులు వాపోతున్నారు. 

ప్రభుత్వం పంట నష్టాన్ని అంచనావేసి తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. మరోవైపు దమ్మపేట గ్రామంలో పలు వీధులు, ఇళ్ళు, పశువుల పాకలు నీటమునిగాయి. కొత్తపేట మోడల్ కాలనీ పై భాగంలో వున్న అప్పకుంట చెరువు అలుగు పడడంతో మోడల్ కాలనీ ఇళ్ళల్లోకి నీళ్ళు చేరాయి. మండల కేంద్రంలోని పశువైద్యశాల, కొత్తపేట ప్రాథమిక పాఠశాల మూడు అడుగుల లోతు నీటిలో మునిగిపోయాయి. రాంజీ కుంట పూర్తిగా నిండిపోయి అర్టన్ కాలనీకి వెళ్ళే చెరువు కట్ట పైనుండి నీళ్ళు వెళ్ళడంతో ఏ క్షణానైనా కట్ట తెగిపోయే ప్రమాదం వుందని ఆయకట్టు రైతులు ఆందోళన చెందుతున్నారు. దమ్మపేట నుండి మందలపల్లి వెళ్ళే ప్రధాన రహదారి జలదిగ్బంధంలో చిక్కుకుంది.

మందలపల్లి నుండి సత్తుపల్లి వెళ్ళే మార్గంలో మందలపల్లి శివారులో గల కొత్త చెరువు నిండి మందలపల్లి నుండి ఖమ్మం వెళ్ళే రాష్ట్రీయ రహదారిపై నీరు ప్రవహించడంతో మందలపల్లి నుండి ఖమ్మం వెళ్ళే వాహనాలను చింతలపూడి వద్దగల రేచర్ల గ్రీన్ ఫీల్డ్ హైవే పైకి మళ్లించారు. చీపురుగూడెం, పెద్దగొల్లగూడెం, పట్వారిగూడెం, పెద్దగొల్లగూడెం, మల్కారం, రాచూరుపల్లి, మల్కారం, తదితర గ్రామాల్లోని చెరువులు, వాగులు నిండిపోయి రహదారులపై నుండి నీళ్ళు వెళ్తుండడంతో రాకపోకలు స్తంభించిపోయాయి. ఈ భారీ వర్షాలకు పలు స్కూళ్ళలోకి వర్షపు నీరు చేరింది. నెమలిపేటలోని ఇళ్ళు పూర్తిగా నీటమునిగాయి. ఎందరు నాయకులు మారుతున్నప్పటికి తమ గోడు పట్టించుకునే వారు లేరని నెమలిపేట వాసులు వాపోతున్నారు.

ఈ సందర్భంగా దమ్మపేట తహశీల్దార్ మద్దినేని మురళి, కాంగ్రెస్ నాయకులు పగడాల రాంబాబు నెమలిపేట గ్రామాన్ని సందర్శించి సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలని సూచించారు. భారీ వర్షాలను సైతం లెక్కచేయకుండా తాహశీల్దార్ మురళి, ఎస్.ఐ. బి. రాజేష్ కుమార్, విద్యుత్ శాఖ అధికారులు, సర్పంచ్ పగడాల రమాదేవిరాంబాబులు నిరంతరం పర్యవేక్షిస్తూ ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరుగకుండా ముందస్తు చర్యలు చేపట్టారు.

మరిన్ని వార్తలు