కుటుంబానికి హీరో.. అతడికి ఎవరు తోడు?

19-11-2026 | 11:40am

కుటుంబం కోసం కష్టపడతాడు.. పిల్లల భవిష్యత్తు కోసం ఎన్నో కలలు కంటాడు.. బాధ్యతల కోసం నిరంతరం పరుగులు తీస్తాడు.. కానీ తనలోని బాధను మాత్రం ఎవరికీ చెప్పుకోడు! ఇలా కుటుంబం, సమాజం కోసం నిరంతరం శ్రమించే పురుషుల కోసం కూడా ఓ ప్రత్యేక రోజు ఉంది. అదే నవంబర్ 19.. అంతర్జాతీయ పురుషుల దినోత్సవం (International Men's Day). ఉదయం నిద్రలేచినప్పటి నుంచి రాత్రి కళ్లు మూసే వరకు ఎన్నో పాత్రలు పోషించే పురుషుల సేవలు, సమస్యలు, ఆరోగ్యం, భావోద్వేగాలను గుర్తుచేసే రోజిది. ఇంట్లో నాన్నగా, జీవిత భాగస్వామికి తోడుగా భర్తగా, పిల్లలకు స్నేహితుడిగా, సమాజంలో బాధ్యతగల వ్యక్తిగా తనవంతు పాత్ర పోషిస్తుంటాడు.

'మగాడివి కదా.. ధైర్యంగా ఉండాలి!' అనే ఒక్క మాటతో ఎన్నో భావోద్వేగాలను మనసులోనే దాచుకునే పురుషులు ఎందరో ఉన్నారు. ఆర్థిక ఒత్తిళ్లు (Financial Stress), ఉద్యోగ సమస్యలు, కుటుంబ బాధ్యతలు, భవిష్యత్తుపై ఆందోళనలు ఇలా ఎన్నో సమస్యలను మౌనంగా భరిస్తుంటారు. తనకెన్ని కష్టాలున్నా కుటుంబ సభ్యుల ముఖంలో చిరునవ్వు చూడాలనుకుంటాడు. తన ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఇతరుల అవసరాలకే ప్రాధాన్యత ఇస్తుంటాడు. మానసిక ఒత్తిడి (Mental Stress), కుంగుబాటు (Depression), ఒంటరితనం వంటి సమస్యలు పురుషులను కూడా వేధిస్తుంటాయి. అయితే తమ బాధలను బయటపెడితే బలహీనులుగా చూస్తారనే భయంతో చాలామంది మనసులోని మాటను చెప్పుకోలేకపోతుంటారు.

పురుషుల దినోత్సవం అంటే వారి గొప్పతనాన్ని మాత్రమే చాటడం కాదు.. వారి ఆరోగ్యం, హక్కులు, బాధ్యతలు, భావోద్వేగాలకు (Emotions) సమాన ప్రాధాన్యత ఇవ్వడం. స్త్రీ, పురుషులు ఒకరిపై మరొకరు ఆధిపత్యం చెలాయించడం కాకుండా పరస్పరం గౌరవించుకుంటూ సమానంగా ఎదగడమే సమాజ లక్ష్యం కావాలి. ఈ రోజు ఒక్కటే గుర్తుంచుకుందాం.. కుటుంబం కోసం నిరంతరం నిలబడే పురుషుడి వెనుక కుటుంబ సభ్యులు కూడా అండగా నిలవాలి. ఎందుకంటే ప్రతి ఇంట్లో ఓ హీరో ఉంటాడు.. కానీ ఆ హీరోకీ ఓ తోడు, ఓ భరోసా అవసరమే! 

మరిన్ని వార్తలు