గ్రామంలో కుల చిచ్చు రేపుతూ అరాచకాలు!
సర్పంచ్ భర్త, కుటుంబ సభ్యులపై చర్యలు తీసుకోవాలి.. మోటకొండూర్ ఎంఆర్సీ భవనం ఎదుట అఖిలపక్షం ధర్నా
ఆలేరు, నవంబర్ 4 (విజయక్రాంతి): గ్రామంలో ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తూ, కులాల మధ్య చిచ్చు పెడుతూ అరాచకాలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ కదిరేణిగూడెం సర్పంచ్ జెట్ట లత(Jetta Latha, Sarpanch of Kaderenigudem) భర్త జెట్ట మహేశ్వర్, ఆయన కుటుంబ సభ్యుడు జెట్ట లక్ష్మణ్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అఖిలపక్ష నాయకులు(Leaders of all parties) డిమాండ్ చేశారు.
బుధవారం మోటకొండూర్ ఎంఆర్సీ భవనంలో నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశం సందర్భంగా అఖిలపక్షం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి ఎంపీడీవోకు వినతిపత్రం అందజేశారు. సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు కోమటిరెడ్డి చంద్రారెడ్డిపై పెట్టిన అక్రమ కేసును వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా కోమటిరెడ్డి చంద్రారెడ్డి, మాజీ సర్పంచ్ వేముల పాండు, కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడు పైళ్ల గణపతిరెడ్డి, బీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు సతీష్ మాట్లాడుతూ.. కొత్తగా సర్పంచ్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఆమె భర్త జెట్ట మహేశ్వర్ గ్రామ పాలనలో జోక్యం చేసుకుంటూ పెత్తనం చెలాయిస్తున్నారని ఆరోపించారు.
చెత్త సేకరణకు ఇద్దరు కార్మికులు ఉండాల్సి ఉండగా ఒక్కరినే పంపించి మరొకరితో స్వీపర్ పని చేయించడంతో గత నెల 27న కోమటిరెడ్డి కమలమ్మ అనే వృద్ధురాలు చెత్త వేస్తుండగా ప్రమాదవశాత్తు కిందపడి ఎడమ తొంటి ఎముక విరిగిందని తెలిపారు.
ఈ ఘటనపై గత నెల 30న గ్రామసభలో అధికారుల సమక్షంలో ప్రశ్నించిన కోమటిరెడ్డి చంద్రారెడ్డిపై సర్పంచ్ భర్త జెట్ట మహేశ్వర్, జెట్ట లక్ష్మణ్ దుర్భాషలాడుతూ బెదిరింపులకు పాల్పడ్డారని ఆరోపించారు. అంతేకాకుండా ఆయనపై అక్రమ కేసు పెట్టించేందుకు తప్పుడు సాక్ష్యాలు సృష్టించారని విమర్శించారు.
సర్పంచ్‌గా ఎన్నికైన వ్యక్తి గ్రామంలో నివసిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండాలని, కానీ సర్పంచ్ హైదరాబాద్‌లో ఉంటూ ప్రజలకు అందుబాటులో ఉండటం లేదని, కనీసం ఫోన్ నంబర్ కూడా ప్రజలకు ఇవ్వలేదని నాయకులు ఆరోపించారు. ఈ వ్యవహారంపై గత జూన్‌లోనే జిల్లా కలెక్టర్ పంచాయతీరాజ్ విభాగం ద్వారా హెచ్చరిక మెమో జారీ చేసినప్పటికీ పరిస్థితిలో మార్పు రాలేదన్నారు.
గతంలో సీసీ కెమెరాలు, మద్యం నిషేధం, బునాది గాని కాలువ మట్టి తదితర అంశాల్లోనూ ఏకపక్షంగా వ్యవహరించారని ఆరోపించారు. గ్రామ సమస్యలను ప్రశ్నించే వారిపై సర్పంచ్ భర్త, కుటుంబ సభ్యులు ఎదురుదాడికి దిగడం సరికాదన్నారు. గ్రామంలో కుల రాజకీయాలు చేస్తూ ఒక సామాజిక వర్గాన్ని దూరం పెట్టే ప్రయత్నం చేయడం వల్ల ప్రశాంత వాతావరణం దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేశారు. సంబంధిత శాఖల అధికారులు వెంటనే స్పందించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ ధర్నాకు సర్పంచుల ఫోరం జిల్లా అధ్యక్షుడు కొప్పుల వెంకటరెడ్డి సంఘీభావం తెలిపారు. కార్యక్రమంలో నాలుగో వార్డు సభ్యుడు వేముల నరసింహ, పైళ్ల మల్లారెడ్డి, మాజీ వార్డు సభ్యులు తొండల ఆగయ్య, కోమటిరెడ్డి బుచ్చమ్మ, అఖిలపక్ష నాయకులు రాంపల్లి అమరేందర్, ఆమనగంటి వెంకటేష్, కోమటిరెడ్డి అంజిరెడ్డి, రాంపల్లి కృష్ణకుమార్, తొండల సతీష్, పన్నాల అంజిరెడ్డి, నోముల మల్లారెడ్డి, తొండల బాలమ్మ, రాంపల్లి లావణ్య, మేకల అలివేలు, శివ మంగమ్మ, శ్యామల అశోక్, బొడ్డుపల్లి నరేష్ తదితరులు పాల్గొన్నారు.