సులభ్ కాంప్లెక్స్‌లో సులభంగా మద్యం విక్రయాలు!

22-10-2026 | 05:20am
  1. మందుబాబులకు సులువుగా లభ్యం                                                               
  2. మద్యం సేవిస్తూ మస్తు మజా..                                              
  3. ఆలేరు ఆర్టీసీ బస్టాండ్ పరిసరాల్లో నిబంధనలకు తూట్లు?                                               
  4. అయినా పత్తాలేని ఎక్సైజ్ అధికారులు!

ఆలేరు, అక్టోబర్ 21 : ప్రజలు నిత్యం రాకపోకలు సాగించే ఆలేరు పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ మెయిన్ రోడ్డులో ఉన్న సులబ్ కాంప్లెక్స్ పరిసరాల్లో మద్యం విక్రయాలు కలకలం రేపుతున్నాయి. దసరా పండుగ సందర్భంగా బహిరంగ ప్రదేశాల్లో మద్యం విక్రయాలు జరుగుతున్నాయనే ఆరోపణలు రాగా ఆలేరు సులబ్ కాంప్లెక్స్లోనూ మద్యం విక్రయాల విషయం వెలు గులోకి రావడంతో దానికి మరింత బలం చేకూరున్నట్లు అయింది. 

సులబ్ కాంప్లెక్స్‌లో సులభంగా మద్యం..

ఆలేరు పట్టణంలోని సులబ్ కాంప్లెక్స్ను ఆదిలాబాద్ జిల్లా, నేరడిగొండ మండలం, కొరటికల్ కె గ్రామానికి చెందిన మాణిక్ రావ్ నిర్వహిస్తున్నారు. అయితే అదే సులబ్ కాంప్లెక్స్లో అక్రమంగా(Irregularity at Sulabh Complex) మద్యం విక్రయాలు జరుపుతున్నారనే ఆరోపణలు వస్తుండగా దసరా పండుగా రోజున ఎక్కువ సంఖ్యలో మందుబాబులు అందులోకి వెళ్లి వస్తుండడంతో అసలు విషయం బయటకు వచ్చినట్లు తెలుస్తుంది. 

24 గంటలు అమ్మకాలు : వాస్తవికంగా ఈ సులబ్ కాంప్లెక్స్ కు  అతి సమీపంలోనే  వైన్ షాప్ ఉండగా దానిలో ఖచ్చితమైన సమయపాలన పాటించాలని నిబంధన ఉంది. కానీ ఈ సులబ్ కాంప్లెక్స్ మాత్రం 24 గంటలు నడుపుతుండడంతో దానికి తోడు మద్యం విక్రయాలు కూడా 24 గంటలు నడుపుతూ నిరతరం మందుబాబులకు అందుబాటులో ఉంచుతున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.       

నిబంధనలకు తూట్లు..

ప్రజల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన సులబ్ కాంప్లెక్స్లు మద్యం విక్రయాలకు, ఇతర కార్యకలాపాలకు వేదికలుగా మారడంతో కొందరు స్వార్ధపరులు ప్రభుత్వ నిబంధనలకు తూట్లు పెడుతున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఆలేరు బస్టాండ్ ఆనుకుని ఉన్న సులబ్ కాంప్లెక్స్ ఉండడం,

దీనికి తోడు ఎదురుగానే వైన్ షాప్ ఉండడంతో ఇంత పబ్లిక్ గా అక్రమంగా ఎలా మద్యం విక్రయాలు చేస్తున్నారనే ప్రశ్నలు స్థానికంగా వినిపిస్తున్నాయి. ఆలేరు నియోజకవర్గ కేంద్రంలోని ప్రజా ప్రదేశాల్లోనే ఇలాంటి పరిస్థితి ఉంటే మండల కేంద్రాలు, గ్రామాల్లో మద్యం విక్రయాలు ఇంకా ఎంత జోరుగా సాగుతుండోచ్చో అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.                                    

ఆ మద్యం ఎక్కడిది? 

వాస్తవికంగా  సులబ్ కాంప్లెక్స్ కు ఎదురుగానే ఓ వైన్ షాప్ ఉండగా దేనిలోనూ అక్రమంగా గుట్టు చప్పుడు కాకుండా మద్యం అమ్మకాలు చేస్తున్నారు. అయితే ఇందులో అమ్ముతున్న మద్యం ఎదురుగా ఉన్న వైన్ షాప్ లోది కాకుండా వేరే ప్రాంతం నుండి తెచ్చి అమ్ముతున్నారనే ఆరోపణలు వినవస్తున్నాయి.

అందుకే కొందరు ఈ విషయంపై దృష్టి సారించి పనిగట్టుకుని ఆ అక్రమ మద్యం అమ్మకాలను వెలుగులోకి తీసుక వచ్చారనే ప్రచారం స్థానికంగా వినిపిస్తుంది.  అసలు ఈ మద్యం బాటిళ్లు ఎక్కడి నుండి వచ్చాయి.. అవి ఒరిజినలా.. నకిలీవా.. వాటి సరఫరాలో ఎవరి పాత్ర ఉంది అనే విషయాలు అధికారుల విచారణలో తేలనున్నట్లు తెలుస్తుంది.

పత్తాలేని ఎక్సైజ్ శాఖ? 

నియోజకవర్గ కేంద్రంలో బస్టాండ్ సమీపంలోనే ఇలా జరుగుతున్నా ఎక్సైజ్ శాఖాధికారులు మాత్రం ఏమాత్రం పట్టించుకోలేదనే విమర్శలు వస్తున్నాయి. అంతేకాకుండా స్థానికులు అక్రమ మద్యం అమ్మకాలను వెలుగులోకి తీసుకువచ్చినా వారి తీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

పట్టుకున్న వారే సమాచారం అందిస్తే కానీ అప్పుడు కేసు చేస్తున్నాము అనే సమాధానం వచ్చినట్లు స్థానికులు చెబుతున్నారు.  ఇప్పటికైనా ఎక్సైజ్ శాఖాధికారులు పూర్తి స్థాయి విచారణ చేపట్టి దీనికి బాధ్యులు వారిపై చర్యలు తీసుకోవడంతో పాటు అక్రమ మద్యం విక్రయాలకు అడ్డుకట్ట వేయాలని పలువురు కోరుతున్నారు.

దీనికి తోడు మున్సిపల్ అనుమతులు, బిల్లుల చెల్లింపులు, మద్యం విక్రయాల చట్టబద్ధత వంటి అంశాలపైనా సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను వెల్లడించాలనీ  కోరుతున్నారు. కాగా ఇదే విషయంపై ఎక్సైజ్ సీఐ నాగలతకు వివరణ కోసం ఫోన్ చేయగా ఆమె అందుబాటులోకి రాకపోవడం గమనార్హం.

మరిన్ని వార్తలు