‘నాట్ ఫర్ సేల్’ పాలపొడి అక్రమంగా విక్రయం.. ఒకరి అరెస్ట్

29-09-2026 | 11:18pm

ఆలేరు, సెప్టెంబర్ 29 (విజయక్రాంతి): తెలంగాణలో విక్రయించేందుకు అనుమతి లేని పాలపొడిని అక్రమంగా తరలిస్తూ విక్రయిస్తున్న వ్యక్తిని ఆలేరు పోలీసులు(Alair Police) పట్టుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. సెప్టెంబర్ 28న సాయంత్రం 7.30 గంటల సమయంలో ఆలేరు పోలీసులకు విశ్వసనీయ సమాచారం అందింది.

దీంతో ఎస్‌ఐ జి.ఉదయ్ కిరణ్ సిబ్బందితో కలిసి పొచమ్మవాడకు చేరుకున్నారు. అక్కడ రాత్రి 7.45 గంటల సమయంలో పొచమ్మవాడకు చెందిన చిన్ని సిద్దులు (44)ను అదుపులోకి తీసుకుని తనిఖీ చేయగా, అతని వద్ద 7 నల్లరంగు ప్లాస్టిక్ బ్యాగులు ఉన్నట్లు గుర్తించారు. వాటిలో ఆకుపచ్చ, తెలుపు రంగు ప్యాకెట్లలో కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ‘నందిని’ బ్రాండ్ పాలపొడి ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ప్యాకెట్లపై ‘నాట్ ఫర్ సేల్’ అని ముద్రించి ఉన్నట్లు పేర్కొన్నారు. 

మధ్యవర్తుల సమక్షంలో విచారించగా.. తాను చిట్టబోయిన దామోదర్‌తో కలిసి ఈ పాలపొడిని సమీప గ్రామాల్లోని పన్నీర్ తయారీదారులకు సరఫరా చేస్తున్నట్లు సిద్దులు అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. ఎలాంటి ప్రభుత్వ అనుమతులు, ట్రేడ్ లైసెన్స్ లేకుండా పాలపొడిని సరఫరా చేస్తూ అక్రమంగా లాభాలు పొందుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

మరిన్ని వార్తలు