కొండ రాళ్లపై చరిత్ర చెక్కిన క్రీడ
కొండల్లో ప్రాచీన క్రీడకు ఆనవాళ్లు
-సర్కిల్ అండ్ క్రాస్ ఆటకు చారిత్రక గుర్తులు
-నారాయణపూర్ కొండల్లో అరుదైన క్రీడా గుర్తులు
-వేల ఏళ్ల చరిత్రకు ఆనవాళ్లా.?
భారతదేశపు ప్రాచీన క్రీడా సంప్రదాయాలకు నిదర్శనంగా వెంకటాపూర్ మండలం(Venkatapur Mandal) నారాయణపూర్ గ్రామంలోని కొండ ప్రాంతంలో అరుదైన క్రీడా ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. కొండ రాళ్లపై, ప్రాచీన ఆలయాల పరిసరాల్లో కనిపించే ఆకృతులు గతంలో ప్రజలు ఆడిన క్రీడలకు సంబంధించినవిగా చరిత్ర పరిశోధకులు భావిస్తున్నారు. నారాయణపూర్ కొండ ప్రాంతంలో కనిపిస్తున్న ‘సర్కిల్ అండ్ క్రాస్ గేమ్’ ఆకృతి ఇప్పుడు ఆసక్తిని రేకెత్తిస్తోంది.
కొండల్లోనే కాదు.. ఆలయాల్లోనూ..
ప్రాచీన కాలంలో ప్రజల జీవన విధానంలో క్రీడలకు ఉన్న ప్రాధాన్యతకు ఇలాంటి రాతి ఆకృతులు ఆధారాలుగా నిలుస్తున్నాయి. కొండ ప్రాంతాల్లో కనిపించే ఈ తరహా ఆటల బోర్డులు, గుర్తులు కేవలం ఒక ప్రాంతానికే పరిమితం కాలేదని తెలుస్తోంది. ప్రాచీన దేవాలయాల అడుగుభాగాలు, ఆలయ ప్రాంగణాలు, రాతి నిర్మాణాలపై కూడా ఇలాంటి క్రీడలకు సంబంధించిన ఆనవాళ్లు కనిపిస్తున్నాయి.
కర్ణాటకలోని హైర్ బెనకల్ తో పోలిక
కర్ణాటక రాష్ట్రంలోని హైర్ బెనకల్ ప్రాంతంలోనూ ఇలాంటి ప్రాచీన క్రీడా ఆకృతులను చరిత్రకారులు గుర్తించినట్లు సమాచారం. అక్కడ లభించిన ఆనవాళ్లతో నారాయణపూర్ కొండ ప్రాంతంలోని ‘సర్కిల్ అండ్ క్రాస్’ ఆకృతికి పోలికలు ఉండటం చారిత్రకంగా ప్రాధాన్యత సంతరించుకుంది.
రామప్ప నుంచి కొలనుపాక వరకు
తెలంగాణలోని ప్రాచీన ఆలయాలు కేవలం ఆధ్యాత్మిక కేంద్రాలుగానే కాకుండా నాటి ప్రజల జీవన విధానం, కళలు, సంస్కృతి, క్రీడా సంప్రదాయాలకు కూడా ప్రతిబింబాలుగా నిలుస్తున్నాయి. రామప్ప దేవాలయం, ఖిలా వరంగల్, కొలనుపాక వంటి చారిత్రక ప్రాంతాల్లోనూ ఇలాంటి క్రీడా ఆనవాళ్లు కనిపిస్తాయని చరిత్ర పరిశోధకులు చెబుతున్నారు.