పంటల కొనుగోళ్లను పరిశీలించిన వ్యవసాయ విద్యార్థులు
వివిధ ప్రక్రియలను వివరించిన మార్కెట్ చైర్మన్
ఆదిలాబాద్, నవంబర్ 28, (విజయక్రాంతి) : వ్యవసాయ మార్కెటింగ్ ప్రాక్టికల్(Agricultural Marketing Practical) కార్యక్రమంలో భాగంగా ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల(Agricultural College, Adilabad) అసిస్టెంట్ ప్రొఫెసర్ డా. కుమారస్వామి ఆధ్వర్యంలో తృతీయ సంవత్సరం విద్యార్థులు శనివారం ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డును(Adilabad Agricultural Market Yard) క్షేత్ర పర్యటనలో బాగంగా సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులు మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి, కార్యదర్శి విఠల్, సిబ్బందితో ముఖాముఖి నిర్వహించారు.
మార్కెట్ కమిటీలో జరిగే వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ విధానం, ఎలక్ట్రానిక్ తూకం వేసే ప్రక్రియ, ఈ-నామ్(e-NAM) ద్వారా జరిగే వేలం నిర్వహణ, రైతులకు గిట్టుబాటు ధర లభించే విధానం తదితర అంశాల గురించి చైర్మన్ విద్యార్థులకు క్షుణ్ణంగా వివరించారు. అలాగే, సుదూర ప్రాంతాల నుండి పంట ఉత్పత్తులను విక్రయించడానికి మార్కెట్కు వచ్చే అన్నదాతల సౌకర్యార్థం యార్డులో ఏర్పాటు చేసిన రైతు అతిథి గృహం, రాయితీ భోజన సదుపాయాలు, ఇతర మౌలిక వసతుల గురించి విద్యార్థులకు తెలియజేశారు.
భవిష్యత్తులో వ్యవసాయ శాస్త్రవేత్తలుగా, అధికారులుగా ఎదిగే విద్యార్థులు రైతుల అభ్యున్నతికి, ఆధునిక మార్కెటింగ్ పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించడానికి కృషి చేయాలని ఆకాంక్షించారు. అనంతరం మార్కెట్కు వివిధ ప్రాంతాల నుంచి విక్రయానికి తీసుకువచ్చే ప్రధాన వ్యవసాయ ఉత్పత్తులు, వాటి క్రయవిక్రయ విధానాలు రోజువారీ కార్యకలాపాల గురించి మార్కెట్ కార్యదర్శి విద్యార్థులకు వివరించారు.