ఇంద్ర సౌర గిరి జల వికాసం పనులు వేగవంతం చేయాలి
ఎంపిక చేసిన గ్రామాల్లో గిరిజన రైతులకు బోరుబావులు, సౌర విద్యుత్ ఆధారిత నీటి పంపింగ్ సౌకర్యాలు కల్పించాలి
ప్రాజెక్టు అధికారి మంద మకరందు... సబ్ కలెక్టర్ ప్రణయ్ కుమార్
ఉట్నూర్, నవంబర్ 28 ( విజయక్రాంతి): ఇంద్ర సౌర గిరి జల వికాసం కార్యక్రమం(Indra Saura Giri Jala Vikasam Program) అమలుకు సంబంధించి శనివారం మధ్యాహ్నం సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ(Integrated Tribal Development Agency) (ITDA) ఉట్నూర్ ప్రాజెక్టు అధికారి మంద మకరందు, సబ్ కలెక్టర్ ప్రణయ్ కుమార్(Sub-Collector Pranay Kumar) ఆధ్వర్యంలో ఐటీడీఏ కార్యాలయంలోని(ITDA Office) ప్రాజెక్టు అధికారి ఛాంబర్లో జిల్లా స్థాయి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆదిలాబాద్ జిల్లాలోని ఇంద్రవెల్లి మండలం హేరాపూర్ గ్రామం, ఉట్నూర్ మండలం మరుగూడ గ్రామాలను ఇంద్ర సౌర గిరి జల వికాసం కార్యక్రమం కింద ఎంపిక చేసినట్లు తెలిపారు.
ఎంపిక చేసిన గ్రామాల్లో అటవీ హక్కుల గుర్తింపు పత్రాలు (ROFR పట్టాలు) కలిగిన గిరిజన రైతులకు వ్యవసాయ అవసరాల నిమిత్తం బోరుబావులు ఏర్పాటు చేయడంతో పాటు, సౌర విద్యుత్ ఆధారిత నీటి పంపింగ్ సౌకర్యాలను కల్పించే అంశాలపై సమావేశంలో సమగ్రంగా చర్చించారు. ఈ కార్యక్రమం ద్వారా గిరిజన రైతులకు సాగునీటి వసతి అందుబాటులోకి తీసుకువచ్చి, వ్యవసాయ ఉత్పాదకతను పెంచేందుకు కృషి చేయాలని సూచించారు.
సంబంధిత శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేస్తూ ఎంపిక చేసిన గ్రామాల్లో బోరుబావుల డ్రిల్లింగ్, సౌర విద్యుత్ పంపింగ్ వ్యవస్థల ఏర్పాటు, ఇతర అవసరమైన అభివృద్ధి పనులను త్వరితగతిన చేపట్టాలని ప్రాజెక్టు అధికారి, సబ్ కలెక్టర్ అధికారులకు సూచించారు. క్షేత్రస్థాయిలో పనుల పురోగతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, అర్హులైన గిరిజన రైతులకు ఈ పథకం ద్వారా పూర్తి ప్రయోజనం చేకూరేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో ఎఫ్ డి ఓ అరవింద్,డీడీ అశోక్‌తో పాటు సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.