పూలే ఆశయాల సాధనకు ఐక్యంగా కృషి చేయాలి
ఉట్నూర్, నవంబర్ 28 (విజయక్రాంతి): అణగారిన వర్గాల ఆశాజ్యోతి మహాత్మా జ్యోతిరావు పూలే (Mahatma Jyotirao Phule) ఆశయాల సాధనకు ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల ప్రజలు సమన్వయంతో ఐక్యంగా కృషి చేయాలని స్వధర్మ ఫౌండేషన్ (Swadharma Foundation) వ్యవస్థాపకుడు కుడెల్లి అశోక్ కోరారు. శనివారం ఉట్నూర్ మండల కేంద్రంలోని స్వధర్మ కార్యాలయంలో ఫౌండేషన్ ఆధ్వర్యంలో బీసీ సంఘాల నాయకులతో కలిసి పూలే వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
అనంతరం అశోక్ మాట్లాడుతూ కుల వ్యవస్థ (Caste System), బానిసత్వం, మూఢనమ్మకాలు, సామాజిక దోపిడీని ఎండగట్టిన గొప్ప సామాజిక ఉద్యమకారుడు పూలే అని కొనియాడారు. తన జీవితాంతం అట్టడుగు వర్గాల విద్య, విజ్ఞానం, సామాజిక విముక్తి కోసం పోరాడిన తొలి గురువుగా ఆయన నిలిచారని పేర్కొన్నారు. సమాజంలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు విద్య అందించేందుకు విశేష కృషి చేసిన మహనీయుడని గుర్తుచేశారు.
ఈ కార్యక్రమంలో వివిధ బీసీ సంఘాల నాయకులు గోపికృష్ణ, ఉష్కమల్ల దేవిదాస్, బింగి వెంకటేష్, బొడ్డు కిరణ్, తొగరు రఘు, వెంకటేష్, నర్సయ్య, రామగిరి వేణు, అడేళ్లు, విలాస్ తదితరులు పాల్గొన్నారు.