భర్త మర్డర్ మిస్టరీ వీడింది.. భార్యే సూత్రధారి

28-11-2026 | 05:48pm

హైదరాబాద్: పాతబస్తీ బండ్లగూడలో కార్ల వ్యాపారి(Car Dealer) మహ్మద్ అబ్దుల్ రహీం హత్య కేసు(Murder Case)లో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. తొలుత గుర్తుతెలియని వ్యక్తి చేసిన హత్యగా భావించిన ఈ ఘటన వెనుక కుటుంబ సంబంధాలే కారణమని పోలీసుల దర్యాప్తులో వెల్లడైనట్లు సమాచారం. భర్తను హత్య చేసేందుకు భార్య షిరీన్ సుల్తానా తన ప్రియుడితో కలిసి పథకం వేసినట్లు పోలీసులు గుర్తించారు.

బండ్లగూడ(Bandlaguda)లోని అబూబకర్ కాలనీలో నివసించే రహీం (45) సెకండ్‌హ్యాండ్ కార్ల వ్యాపారం నిర్వహించేవాడు. నవంబర్ 27న తెల్లవారుజామున మాస్క్, టోపీ ధరించిన వ్యక్తి ఆయన ఇంటికి వచ్చాడు. భార్య తలుపు తీయడంతో నేరుగా పడకగదిలోకి వెళ్లి నిద్రిస్తున్న రహీంపై సుత్తితో దాడి చేయడంతో తీవ్రంగా గాయ పడిన రహీం అక్కడికక్కడే మృతి చెందాడు.

హత్య అనంతరం నిందితుడు ఇంటి బాల్కనీ నుంచి పక్కింటి పైకప్పుపైకి దూకి అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ దృశ్యాలు సమీపంలోని సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. వాటిని పరిశీలించిన పోలీసులు హత్యకు పాల్పడిన వ్యక్తి కోసం గాలింపు చేపట్టారు.

కేసు దర్యాప్తులో భాగంగా మృతుడి భార్య షిరీన్ సుల్తానాపై పోలీసులకు అనుమానం వచ్చింది. ఆమెను విచారించగా, ప్రియుడు తబ్రీజ్‌తో కలిసి భర్త హత్యకు కుట్ర పన్నినట్లు తెలిపింది. తమ అక్రమ సంబంధానికి రహీం అడ్డుగా ఉన్నాడనే కారణంతో ఈ ఘాతుకానికి పథకం వేసినట్లు దర్యాప్తులో తేలినట్లు పోలీసులు పేర్కొన్నాయి. ఈ ఘటనతో బండ్లగూడ ప్రాంతంలో కలకలం రేగింది. ఈ మేరకు నిందితులను అరెస్టు చేసి రిమాండ్ తరిలించారు. 

మరిన్ని వార్తలు