నిరుపేద కుటుంబాలకు టీజీపీఈఏ ఆర్థిక చేయూత
ఇద్దరికి రూ.1.05 లక్షల సహాయం
గణపురం, నవంబర్ 28 (విజయక్రాంతి): టీజీపీఈఏ కేటీపీపీ శాఖ(TGPEA KTPP Branch), టీజీ జెన్‌కో ఇంజినీర్స్ గ్రూప్(TG Genco Engineers Group) ఆధ్వర్యంలో ఆపదలో ఉన్న నిరుపేద కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించారు. హైదరాబాద్ రైన్‌బో ఆసుపత్రిలో(Rainbow Hospital, Hyderabad) చికిత్స పొందుతున్న ఏడేళ్ల బాలుడు మాస్టర్ విఘ్నేష్ వైద్య ఖర్చుల కోసం రూ.65 వేలు అందజేశారు. విఘ్నేష్ తండ్రి కుంజా శ్రీనివాస్ భూపాలపల్లి వైద్య విభాగంలో కాంట్రాక్ట్ ఉద్యోగిగా పనిచేస్తున్నారు.
అలాగే బీటెక్ చివరి సంవత్సరం చదువుతున్న నాంపల్లి రాజశ్రీ విద్యా ఖర్చుల కోసం రూ.40 వేలు అందించారు. రాజశ్రీ తండ్రి నాంపల్లి వేణు జెన్‌కోలో కాంట్రాక్ట్ ఉద్యోగిగా పనిచేస్తున్నారు. ఈ రెండు కార్యక్రమాల్లో చీఫ్ ఇంజినీర్ ప్రకాష్, సూపరింటెండింగ్ ఇంజినీర్లు, డివిజనల్ ఇంజినీర్లు, ఏఈడీలు, ఏఈలు, టీజీపీఈఏ నాయకులు పాల్గొన్నారు.
వైద్య బృందం తరఫున మెడికల్ ఆఫీసర్ సందీప్, డీపీఓ చిరంజీవి, ఎపిడెమియాలజిస్ట్ భాష్య నాయక్, డాక్టర్ జ్యోతి, డాక్టర్ మమత పాల్గొన్నారు. విరాళాలు అందించిన సంతోష్, తిరుపతి, రాజ్‌కుమార్, నర్సయ్య, నరేష్, రాజు, భాస్కర్, శ్రద్ధ, శకుంతల, లింగ నాయక్, శంకరయ్య, ఆనంద్‌బాబుకు టీజీపీఈఏ నాయకులు కృతజ్ఞతలు తెలిపారు.