సింగరేణి సేవా సమితి శిక్షకుల ఎంపికకు ఇంటర్వ్యూలు
మందమర్రి, (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా మందమర్రి ఏరియా జీఎం కార్యాలయంలో సోమవారం సింగరేణి సేవా సమితి(Singareni Seva Samithi) ఆధ్వర్యంలో 2026-27 విద్యా సంవత్సరానికి నిర్వహించనున్న వృత్తి శిక్షణ కోర్సుల శిక్షకుల ఎంపికకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. టైలరింగ్, ఫ్యాషన్ డిజైనింగ్, బ్యూటీషియన్, కంప్యూటర్ శిక్షణ విభాగాల్లో మొత్తం ఆరు పోస్టులకు 18 మంది అభ్యర్థులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా డీజీఎం (పర్సనల్) సీహెచ్. అశోక్ మాట్లాడుతూ, ఈ శిక్షణ కోర్సుల ద్వారా స్థానికులకు నైపుణ్యాభివృద్ధితో పాటు స్వయం ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయని తెలిపారు. ఎంపికైన ఆరుగురు అభ్యర్థులు త్వరలో ప్రారంభమయ్యే తరగతులకు శిక్షకులుగా వ్యవహరిస్తారని పేర్కొన్నారు. ఈ ప్రక్రియను ఎస్.ఓ. టు జీఎం జి.ఎల్. ప్రసాద్, ఏజీఎం ఆర్.వి.ఎస్.ఆర్.కె. ప్రసాద్, డీజీఎం కిరణ్ కుమార్, సీనియర్ పీవో ఆర్. సత్యనారాయణ పర్యవేక్షించారు.