సంక్షేమం, అభివృద్ధి ప్రజా ప్రభుత్వ లక్ష్యం

23-11-2026 | 10:21pm

ప్రభుత్వ విప్ డాక్టర్ జాటోత్ రామచంద్రు నాయక్

మహబూబాబాద్: కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమం లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy) నాయకత్వంలో ముందుకు సాగుతుందని ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ జాటోత్ రామచంద్రు నాయక్ అన్నారు.సీరోలు మండలం కాంపల్లిలో నూతనంగా నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య వైద్యశాల, వివో భవనాలను ప్రభుత్వ విప్ డాక్టర్ జాటోత్ రామచంద్రునాయక్, జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ ప్రారంభించారు. గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన అన్నారు.

ఆరోగ్య సేవలు ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉండాలని, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో నివసించే పేద, సామాన్య ప్రజలకు ప్రభుత్వ వైద్య సేవలు ఎంతో కీలకమని తెలిపారు. వైద్య సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉంటూ బాధ్యతాయుతంగా సేవలు అందించాలని, ప్రభుత్వ వైద్యశాలలపై ప్రజల్లో నమ్మకం పెంపొందించే విధంగా వైద్య సేవలు నిర్వహించాలని సూచించారు. గర్భిణీ స్త్రీలు, చిన్నారులు, వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి అవసరమైన వైద్య సేవలు సకాలంలో అందించాలని తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ, ఆరోగ్య కార్యక్రమాలను ప్రజలకు చేరవేయడంలో వైద్య సిబ్బంది కీలక పాత్ర పోషించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి డాక్టర్ రవి రాథోడ్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు