కల్లు దుకాణంపై ఈగల్ టీం ఆకస్మిక దాడులు
మూత్ర నమూనాల పరీక్షల్లో ఆల్ఫ్రాజోలం కల్తీ గుర్తింపు.. ఒకరిపై కేసు నమోదు
బోధన్, నవంబర్ 23 (విజయక్రాంతి): కల్లు దుకాణాల్లో కల్తీకి పాల్పడితే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో నిజామాబాద్ జిల్లా(Nizamabad District) ఎడపల్లి మండలం జానకంపేట గ్రామంలోని కల్లు డిపోపై సోమవారం ఈగల్ టీం ఆధ్వర్యంలో జిల్లా స్పెషల్ ఫోర్స్ పోలీసులు, స్థానిక పోలీసులతో కలిసి ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ తనిఖీల్లో కల్లులో ఆల్ఫ్రాజోలం కల్తీ జరిగినట్లు పరీక్షల్లో గుర్తించి ఒకరిపై కేసు నమోదు చేశారు.
కల్లు దుకాణాల్లో కల్తీ జరుగుతోందన్న సమాచారంతో అధికారులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. దాడుల సందర్భంగా కల్లు తాగిన వ్యక్తుల మూత్ర నమూనాలను సేకరించి అక్కడికక్కడే పరీక్షలు నిర్వహించారు. పరీక్షల్లో ఆల్ఫ్రాజోలం ఆనవాళ్లు గుర్తించడంతో నారగోడు అనే వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు సీఐ పూర్ణేశ్వర్ వెల్లడించారు.
జానకంపేట గ్రామంలో రెండు కల్లు దుకాణాలు నిర్వహిస్తున్నప్పటికీ, వాటిలో ఒక దుకాణానికి మాత్రమే అనుమతి ఉందని స్థానికులు పేర్కొంటున్నారు. అనుమతులు లేకుండా దుకాణాలు నిర్వహించడం, కల్తీకి పాల్పడడం వంటి చర్యలపై అధికారులు దృష్టి సారించాలని గ్రామస్తులు కోరుతున్నారు.
కల్తీపై అధికారుల ప్రత్యేక నిఘా
కల్లు కల్తీపై ఫిర్యాదులు అందిన వెంటనే ఈగల్ టీం, స్పెషల్ ఫోర్స్ బృందాలు రంగంలోకి దిగి తనిఖీలు చేపడుతున్నాయి. కల్తీ జరిగినట్లు నిర్ధారణ అయితే సంబంధిత దుకాణ నిర్వాహకులపై కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటివరకు కామారెడ్డి జిల్లాలో ఒకటి, నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జానకంపేటలో మరొకటి కల్తీకి సంబంధించిన కేసులు నమోదైనట్లు సమాచారం. కల్లు దుకాణాల్లో అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు అధికారులు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు.