మానవతా విలువల పెంపునకు రెడ్ క్రాస్ ప్రత్యేక సభ్యత్వ నమోదు

23-11-2026 | 10:33pm

జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

కామారెడ్డి, నవంబర్ 23 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లాలో ప్రత్యేక కార్యాచర విద్యార్థుల్లో మానవతా విలువలు, సేవాభావం, నాయకత్వ లక్షణాలు, సామాజిక బాధ్యతను పెంపొందించడమే లక్ష్యంగా భారతీయ రెడ్ క్రాస్ సంస్థ తెలంగాణ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో జూనియర్ రెడ్ క్రాస్, యూత్ రెడ్ క్రాస్ ప్రత్యేక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగు వాన్ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా నవంబర్ 14 నుంచి డిసెంబర్ 31 వరకు నిర్వహించనున్న ఈ ప్రత్యేక నమోదు కార్యక్రమాన్ని కామారెడ్డి జిల్లాలో విజయవంతం చేసేందుకు జిల్లా కలెక్టర్, రెడ్ క్రాస్ జిల్లా అధ్యక్షుడు ఆశిష్ సంగ్వాన్(Collector Ashish Sangwan) ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు.

విద్యార్థులను చిన్న వయసు నుంచే సేవా కార్యక్రమాల వైపు ప్రోత్సహిస్తూ, సమాజం పట్ల బాధ్యత కలిగిన పౌరులుగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, జూనియర్ కళాశాలలు, డిగ్రీ, వృత్తి విద్యా కళాశాలల్లో పెద్ద సంఖ్యలో సభ్యత్వాలు నమోదు చేయాలని నిర్ణయించారు.

జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ చైర్మన్‌గా ప్రత్యేక కమిటీ ఏర్పాటు ఈ ప్రత్యేక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేసేందుకు జిల్లా స్థాయిలో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. జిల్లా కలెక్టర్, రెడ్ క్రాస్ జిల్లా అధ్యక్షుడు ఆశిష్ సంగ్వాన్ చైర్మన్‌గా వ్యవహరించనుండగా, రెడ్ క్రాస్ కామారెడ్డి జిల్లా చైర్మన్ డాక్టర్ సంజీవ్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర శాఖ నిర్వహణ కమిటీ సభ్యులు, రాష్ట్ర ఆర్థిక కమిటీ సభ్యులు డాక్టర్ ఎం. జైపాల్ రెడ్డి సభ్యులుగా, జిల్లా విద్యాశాఖ అధికారి మల్లికార్జున్ కన్వీనర్‌గా వ్యవహరిస్తారు.

విద్యాసంస్థల సమన్వయంతో విస్తృత సభ్యత్వ నమోదు

జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ మార్గదర్శకత్వంలో జిల్లా విద్యాశాఖ, పాఠశాలలు, కళాశాలల యాజమాన్యాలు, జాతీయ సేవా పథకం, జాతీయ విద్యార్థి దళం, స్కౌట్స్ అండ్ గైడ్స్, యువజన సంఘాల సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని విస్తృతంగా నిర్వహించనున్నారు. ప్రతి విద్యాసంస్థ నుంచి విద్యార్థులను జూనియర్ రెడ్ క్రాస్, యూత్ రెడ్ క్రాస్ సేవా సభ్యులుగా చేర్పించేందుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించారు.

మాదకద్రవ్యాల నిర్మూలనపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు

ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా మాదకద్రవ్యాల నిర్మూలనకు సంబంధించిన వివిధ అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. విద్యార్థుల్లో మత్తు పదార్థాల దుష్ప్రభావాలపై చైతన్యం కల్పించేందుకు వ్యాసరచన, వక్తృత్వం, చిత్రలేఖనం, పోస్టర్ల తయారీ తదితర పోటీలను నిర్వహించనున్నారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉంటూ ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకునేలా ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టనున్నారు. ఈ కార్యక్రమంపై రెడ్ క్రాస్ కామారెడ్డి జిల్లా చైర్మన్ డాక్టర్ సంజీవ్ రెడ్డి, రాష్ట్ర నిర్వహణ కమిటీ, ఆర్థిక కమిటీ సభ్యులు డాక్టర్ ఎం. జైపాల్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించి సభ్యత్వ నమోదు లక్ష్యాలను సాధించేందుకు కృషి చేస్తున్నారు.

మరిన్ని వార్తలు