కేటీఆర్ దమ్ముంటే వరంగల్ పశ్చిమలో పోటీ చేయ్
* వరంగల్ అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమా? కేటీఆర్కు నాయిని సవాల్.
హనుమకొండ, నవంబర్ 23 (విజయక్రాంతి): బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో తెలంగాణ రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి, అభివృద్ధి పేరుతో ప్రజలను మోసం చేశారని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి(MLA Naini Rajender Reddy), వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య సంయుక్తంగా విమర్శించారు. సోమవారం హనుమకొండలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో జరిగిన వైఫల్యాలను ఎండగట్టారు.
ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ వంద అబద్ధాలు చెప్పి ప్రజలను మోసం చేశారని, ప్రజలు వందసార్లు ముక్కు నేలకు రాసినా ఆయనను క్షమించే పరిస్థితిలో లేరని అన్నారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలన కొబ్బరికాయలు కొట్టడం, శిలాఫలకాలు వేయడానికే పరిమితమైందని, నిజంగా అభివృద్ధి చేసి ఉంటే ప్రజలు ఆ పార్టీని ఎందుకు ఓడించేవారని ప్రశ్నించారు. గత ప్రభుత్వ హయాంలో అసంపూర్తిగా వదిలేసిన అభివృద్ధి పనులను కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కొక్కటిగా పూర్తి చేస్తోందని తెలిపారు. ఇందుకు కాళోజీ కళాక్షేత్రమే నిదర్శనమన్నారు.
గత ప్రభుత్వం సుమారు రూ.20 కోట్లతో పిల్లర్లు, స్లాబ్ పనులు చేపట్టి నిర్మాణాన్ని అసంపూర్తిగా వదిలేసిందని, నిర్మాణ నాణ్యతపై ఎన్ఐటీ నిపుణులతో పరిశీలన చేయించాల్సి వచ్చిందని వివరించారు. భవనం పటిష్టత కోసం మరో రూ.10 కోట్లు కేటాయించినప్పటికీ ఆ నిధుల వినియోగంపై అవకతవకలు జరిగాయని ఆరోపించారు. దీనిపై విజిలెన్స్ విచారణ కొనసాగుతోందని తెలిపారు.ఎమ్మెల్యేగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సంబంధిత శాఖలతో సమీక్షలు నిర్వహించి, కుడా, పర్యాటక శాఖల సమన్వయంతో కళాక్షేత్రం పనులను ముందుకు తీసుకెళ్లామని, సుమారు రూ.80 కోట్ల నిధులు సమకూర్చి పనులు చేపట్టామని వివరించారు. గతంలో అసంపూర్తిగా వదిలేసిన పనులను పూర్తి చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేయడం సరికాదన్నారు.
వరంగల్ విమానాశ్రయానికి గతంలో 696 ఎకరాల 14 గుంటల భూమి మాత్రమే ఉండగా, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరో 253 ఎకరాల భూమిని సేకరించిందని, ఇందుకోసం రూ.205 కోట్లకు పైగా ఖర్చు చేసిందని తెలిపారు. గత ప్రభుత్వం పదేళ్లలో చేసిన అభివృద్ధి, కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులపై పూర్తి ఆధారాలు, జీవోలు, నిధుల కేటాయింపులతో బహిరంగ చర్చకు తాను సిద్ధమని నాయిని సవాల్ విసిరారు. హనుమకొండ చౌరస్తాలోనే చర్చకు రావాలని బీఆర్ఎస్ నాయకులను కోరారు. పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్ని నిధులు తీసుకొచ్చింది, కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత ఖర్చు చేస్తోందో ప్రజల సమక్షంలో వివరిస్తానన్నారు.
అభివృద్ధి పేరుతో గతంలో ప్రాజెక్టులను ప్రారంభించి, వాటిని అసంపూర్తిగా వదిలేసి, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంపై నిందలు వేయడం బీఆర్ఎస్ నాయకులకు అలవాటుగా మారిందన్నారు. ఎంపీ కడియం కావ్య మాట్లాడుతూ బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో అర్హులైన లబ్ధిదారులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను అందించ లేకపోయారని విమర్శించారు. నిరుపయోగంగా, శిథిలావస్థకు చేరిన ఇళ్లకు కాంగ్రెస్ ప్రభుత్వం కోట్లాది రూపాయలు వెచ్చించి మరమ్మతులు చేపట్టి లబ్ధిదారులకు అందజేస్తోందన్నారు.
గత ప్రభుత్వం విద్యావ్యవస్థపై సరైన సమీక్షలు నిర్వహించకుండా నిర్లక్ష్యం చేసిందని అన్నారు.మహిళల సమస్యలను పరిష్కరించలేని బీఆర్ఎస్ నాయకులు మహిళా సమస్యలపై మాట్లాడటం విడ్డూరంగా ఉందని వ్యాఖ్యానించారు. పదేళ్లలో తెలంగాణను సుమారు రూ.8 లక్షల కోట్ల అప్పుల్లోకి నెట్టిన కేసీఆర్, మళ్లీ అధికారంలోకి వస్తే రాష్ట్రానికి అదే పరిస్థితి ఎదురవుతుందని విమర్శించారు.ఈ సమావేశంలో వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజ్, కుడా చైర్మన్ గుండు సుధారాణి,జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అజీజ్ ఖాన్,టీపీసీసీ ప్రధాన కార్యదర్శి బొడ్రెడ్డి ప్రభాకర్ రెడ్డి, రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ సంగ వెంకట్రాజం, హనుమకొండ మార్కెట్ కమిటీ చైర్మన్ పులి ప్రియాంక, మాజీ కార్పొరేటర్లు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.