గిరిజన గ్రామాల్లో వైరల్ జ్వరాలు

03-11-2026 | 04:47pm
  1. వాంతులు విరోచనాలతో బాధపడుతున్న గిరిజనం...
  2. ప్రైవేట్ వైద్యులే  దిక్కు...  

ఉట్నూర్, నవంబర్ 03( విజయక్రాంతి ): ఉట్నూర్ ఏజెన్సీ(Utnoor Agency) ప్రాంతంలోని  మారుమూల గిరిజన గ్రామాల్లో దీపావళి దండారి ఉత్సవాల సందర్భంగా  కొంతమంది ఉత్సవాలు జరుపుకుంటే మరికొందరు వైరల్ జ్వరాల( Viral Fevers)  బారిన పడుతున్నారు. ఉట్నూర్ ఏజెన్సీలోని  ఇంద్రవెల్లి, ఉట్నూర్, సిరికొండ, ఆదిలాబాద్ రూరల్, గాదిగూడ, నార్నూర్ మండలాల పరిధిలోని మారుమూల గ్రామాల్లోని ప్రజలు వైరాలు జ్వరాలతో పడడంతో పాటు  కలుషిత నీరు తాగి  వాంతులు విరోచనాలతో బాధపడుతున్నారు.

వైద్య సిబ్బంది గ్రామాల్లో సక్రమంగా పర్యటించకపోవడంతో అనారోగ్యం పాలైన గిరిజనులు ప్రైవేట్ వైద్యులను ఆశ్రయిస్తున్నారు. గ్రామాల్లో నిత్యం తిరిగే ఆర్ఎంపీ డాక్టర్లు  ప్రథమ చికిత్స అందించకుండా  ఎంబిబిఎస్ పట్టా పొందిన  డాక్టర్ల మాదిరిగానే   జ్వరాల బారిన పడిన వారికి  ఇంజక్షన్లు చేయడంతో పాటు  గ్లూకోస్  బాటిల్ ( సైలెన్ బాటిల్లు ) ఎక్కిస్తున్నారు..

సైలెంట్ బాటిల్లో  ఒకటి రెండు రకాల ఇంజక్షన్లు కలిపి  రోగులకు అందించడంతో  రోగులు అప్పటికప్పుడే జ్వరం తగ్గిన ఉపశమనం పొందుతూ.. తిరిగి వ్యాధుల బారిన పడుతున్నారు. కన్నాపూర్ గూడ లో  గిరిజనుడు రాము  విరోచనాలతో బాధపడుతుంటే  ప్రైవేట్ వైద్యుడు  ఇంజక్షన్లతోపాటు  సైలెన్ బాటిల్ ఎక్కించారు..

సైలైన్ బాటిల్ లో  ఇంజక్షన్లు కలపడంతో తెలుపు రంగులో ఉండవలసిన  ద్రవం రంగు మారిపోయి కనిపిస్తుంది. కన్నాపూర్ గ్రామానికి చెందిన  మడవి జంగు బాయి జ్వరంతో బాధపడుతుండగా  ఆటోలో సిరికొండ మండల కేంద్రానికి తీసుకు వెళ్తున్నారు.

ఇంద్రవెల్లి మండలంలోని  పిట్ట బొంగరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి రావలసిన  జ్వర బాధితులు  గ్రామాలకు వచ్చే ఆర్ఎంపీ డాక్టర్లతోపాటు సిరికొండ మండల కేంద్రంలో  ఆర్ఎంపీ గా పని చేస్తున్న వైద్యుల వద్దకు  చికిత్స కోసం వెళుతున్నారు.

జ్వరాలతో బాధపడుతున్న వారు  ప్రైవేట్ వైద్యులను ఆశ్రయించడంతో  వారి అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని  వారి వద్ద నుండి వందలాది రూపాయల డబ్బులను  దొండుకుంటున్నట్లు   ప్రజల ఆవేదనతో తెలుపుతున్నారు. ఇప్పటికైనా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు స్పందించి  మారుమూల గ్రామాల్లో  వైద్య సిబ్బంది పర్యటించి వైరల్ జ్వరాలతో బాధపడుతున్న వారికి  వైద్యం అందించాలని ప్రజలు కోరుతున్నారు.

మరిన్ని వార్తలు