ఎక్కడి వర్షపు నీటిని అక్కడే ఆపుకోవాలి..

03-11-2026 | 05:41pm

- డిప్యూటీ సీఈవో సురేందర్

తాడ్వాయి, నవంబర్ 03 (విజయక్రాంతి): ఎక్కడి వర్షపు నీటిని అక్కడే ఆపుకోవాలని డిప్యూటీ సీఈవో సురేందర్(Deputy CEO Surender) తెలిపారు. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండల కేంద్రంలోని రైతు వేదికలో ఎలినినో ప్రభావంతో కలిగే ఇబ్బందులపై మంగళవారం సర్పంచ్ లు, కార్యదర్శులకు ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రతి వర్షపు నీటి బొట్టును నిలువ ఉంచుకునేలా అందరూ కలిసికట్టుగా కృషి చేయాలన్నారు. ఎస్ బి ఎం నిధుల కింద డ్రైనేజీలు, సోక్ పిట్స్ నిర్మించుకోవాలని ఆయన సూచించారు.

గ్రామాల్లో నీటిని నిల్వ ఉంచుకోవడం కోసం చెక్ డ్యాములు నిర్మించుకోవచ్చని తెలిపారు.ఒక్కో చెక్ డ్యామ్ కు రూ.5 లక్షల నుంచి రూ. 10 లక్షల వరకు నిధులు ఖర్చు చేయవచ్చన్నారు. రైతులు తమ పొలాల్లో ఫామ్ ఫండ్స్ నిర్మించుకోవాలని సూచించారు. రైతులు పాంఫండ్స్ నిర్మించుకోవడానికి సర్పంచులు, కార్యదర్శులు రైతులకు అవగాహన కల్పించాలన్నారు. రైతులు ఫామ్ ఫండ్స్  నిర్మించుకుంటే తమ పొలాలలో భూగర్భ జలాలు అభివృద్ధి చెందుతాయని తెలిపారు.

రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఓ రైతు విబిజి రాంజీ పథకం కింద రూ. 50 లక్షల నిధులతో పాం పండ్స్ తదితర పనులు చేసుకున్నారని తెలిపారు. గ్రామాలలో పర్కులేషన్ ట్యాంకులు నిర్మించుకోవడానికి అవకాశం ఉందని తెలిపారు. ఒక్కో గ్రామంలో ఒక్కో పర్కులేషన్ ట్యాంక్ నిర్మించుకోవచ్చని తెలిపారు. రైతులు ఓపెన్ వెల్స్ తవ్వుకోవడానికి ఈ పథకంలో మంచి అవకాశం ఉందని తెలిపారు.వీటిపై రైతులకు అవగాహన కల్పించాలని సర్పంచులకు కార్యదర్శులకు ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి రఘునందన్ రావు, ఎంపీడీవో భరత్ కుమార్, తహసిల్దార్ శ్వేత, ఏపీఓ తిరుపతి, ఆర్ డబ్ల్యూ ఎస్ ఏ ఈ ప్రశాంత్, పశువైద్యాధికారి రమేష్ టెక్నికల్ అసిస్టెంట్లు కృష్ణ గౌడ్, రాజు సర్పంచులు రవీందర్ రెడ్డి, పోచయ్య తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు