పుణె మెట్రోకు గ్రీన్ సిగ్నల్

03-11-2026 | 05:27pm

పుణె: మహారాష్ట్రలో పట్టణ రవాణా వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా కీలక ముందడుగు పడింది. పుణె మెట్రో విస్తరణకు కేంద్ర ప్రభుత్వం భారీ ప్రోత్సాహం అందించింది. మంగళవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(PM Narendra Modi) వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పుణె మెట్రో రైల్ లైన్-3(Pune Metro Line 3)ను ప్రారంభించడంతో పాటు, రెండో దశలో చేపట్టనున్న నాలుగు కొత్త మెట్రో కారిడార్లకు శంకుస్థాపన చేశారు. మొత్తం సుమారు రూ.21,800 కోట్ల విలువైన ప్రాజెక్టులు నగర అభివృద్ధికి కొత్త ఊపునివ్వనున్నాయి.

హింజేవాడి ఐటీ హబ్ నుంచి శివాజీనగర్ వరకు అనుసంధానం కల్పించే మెట్రో లైన్-3ను పింక్ లైన్‌గా పిలుస్తారు. సుమారు 23 కిలోమీటర్ల పొడవైన ఈ మార్గం నిర్మాణానికి రూ.8,300 కోట్లకు పైగా వ్యయం చేశారు. మొత్తం 23 స్టేషన్లతో రూపొందించిన ఈ కారిడార్ అందుబాటులోకి రావడంతో ఐటీ ఉద్యోగులు, విద్యార్థులు, రోజువారీ ప్రయాణికులకు ప్రయాణ సౌకర్యం మెరుగుపడనుంది.

తొలిదశలో 17 స్టేషన్లలో ప్రయాణికులకు సేవలు అందుబాటులోకి రానుండగా, మిగిలిన స్టేషన్లను దశలవారీగా ప్రారంభించనున్నారు. పుణె మెట్రో రెండో దశ(Pune Metro Phase 2)లో సుమారు రూ.13,500 కోట్ల అంచనా వ్యయంతో నాలుగు కొత్త మార్గాలను అభివృద్ధి చేయనున్నారు. ఇందులో 2A, 2B, 4, 4A కారిడార్లు ఉన్నాయి. వనాజ్ నుంచి చాందినీ చౌక్, రామ్‌వాడి నుంచి విత్తల్‌వాడి, ఖరాడి నుంచి ఖడక్వాస్లా, నల్‌స్టాప్ నుంచి మాణిక్‌బాగ్ ప్రాంతాలను ఈ మార్గాలు అనుసంధానించనున్నాయి.

ఈ విస్తరణతో ఖరాడి, మగర్‌పట్టా, హడప్సర్, స్వర్గేట్, వార్జే వంటి కీలక ప్రాంతాలకు మెట్రో కనెక్టివిటీ మరింత పెరగనుంది. ఇప్పటికే ఉన్న మెట్రో వ్యవస్థతో కొత్త మార్గాలను అనుసంధానించడం ద్వారా ప్రయాణికులకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పించనున్నారు.

లైన్-3లో మరో ప్రత్యేకత ఉంది. ఈ మెట్రో సేవలను పూర్తిగా మహిళా ట్రైన్ ఆపరేటర్లు నిర్వహించనున్నారు. అంతేకాకుండా విద్యుత్ అవసరాల్లో సుమారు 30 శాతం సౌర విద్యుత్(Solar power) ద్వారా సమకూర్చేలా ప్రణాళిక రూపొందించారు. మహిళా సాధికారతతో పాటు పర్యావరణహిత రవాణాకు ఈ ప్రాజెక్టు ప్రాధాన్యతనిస్తోంది.

మెరుగైన మెట్రో కనెక్టివిటీ పుణె నగర అభివృద్ధికి మరింత వేగాన్ని అందిస్తుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఆధునిక ప్రజా రవాణా వ్యవస్థ ప్రయాణ సమయాన్ని తగ్గించడంతో పాటు ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తుందని వివరించారు. ఐటీ, ఆటోమొబైల్, ఫార్మా, స్టార్టప్ రంగాల్లో కీలక కేంద్రంగా ఎదుగుతున్న పుణెకు మెట్రో విస్తరణ మరింత ప్రయోజనం చేకూరుస్తుందని అన్నారు.

మరిన్ని వార్తలు