సైబర్ నేరాలపై సమరశంఖం
హైదరాబాద్: దేశవ్యాప్తంగా పెరుగుతున్న సైబర్ నేరాలకు(Cyber Crime) అడ్డుకట్ట వేసేందుకు పోలీసు శాఖలు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందని తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్(DGP CV Anand) స్పష్టం చేశారు. నేరం జరిగిన తర్వాత స్పందించడం కంటే, మోసం జరగకముందే అప్రమత్తమై అడ్డుకోవడమే లక్ష్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. బంజారాహిల్స్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో జాతీయ స్థాయి సైబర్ క్రైమ్(National Cyber Crime) సమన్వయ సమావేశాన్ని ఆయన ప్రారంభించారు.
13 రాష్ట్రాలు.. 11 దర్యాప్తు సంస్థల భాగస్వామ్యం
ఈ కీలక సమావేశానికి 13 రాష్ట్రాల నుంచి 45 మంది పోలీసు అధికారులు హాజరయ్యారు. కేంద్ర, రాష్ట్ర స్థాయికి చెందిన 11 దర్యాప్తు సంస్థల ప్రతినిధులు కూడా పాల్గొన్నారు. సైబర్ నేరాల నియంత్రణ, నేరగాళ్ల నెట్‌వర్క్‌ను గుర్తించడం, రాష్ట్రాల మధ్య సమాచార మార్పిడి వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు.
దేశంలో ఫిర్యాదులు పెరిగినా.. తెలంగాణలో నష్టం తగ్గుదల!
సమావేశంలో డీజీపీ వెల్లడించిన వివరాల ప్రకారం.. దేశవ్యాప్తంగా సైబర్ నేరాల ఫిర్యాదులు 24 శాతం పెరగగా, తెలంగాణలో ఈ పెరుగుదల 3 శాతానికే పరిమితమైంది. మరోవైపు రాష్ట్రంలో సైబర్ నేరాల కారణంగా జరిగిన ఆర్థిక నష్టం 20 శాతం తగ్గినట్లు తెలిపారు. సైబర్ నేరాల నియంత్రణకు తీసుకుంటున్న చర్యలు, సమన్వయ వ్యవస్థల ప్రాధాన్యతను ఆయన వివరించారు.
విదేశాలకు మారుతున్న స్కామ్ కేంద్రాలు!
ఆగ్నేయాసియా నుంచి ఆఫ్రికా, శ్రీలంక వంటి ప్రాంతాలకు సైబర్ మోసాల కేంద్రాలు విస్తరిస్తున్నాయని సమావేశంలో ప్రస్తావించారు. మ్యూల్ బ్యాంకు ఖాతాల వినియోగం, అంతర్రాష్ట్ర సైబర్ ముఠాల కార్యకలాపాలను అరికట్టేందుకు రాష్ట్రాల మధ్య ఉమ్మడి ఆపరేషన్లు చేపట్టేలా కార్యాచరణ రూపొందించినట్లు వెల్లడించారు.
బ్యాంకులకు ప్రత్యేక కార్యాచరణ.. బాధితులకు 1930
సైబర్ మోసాల ద్వారా అనుమానాస్పద లావాదేవీలు గుర్తించిన వెంటనే స్పందించి వాటిని నిలిపివేసేందుకు బ్యాంకులతో ప్రత్యేక సమన్వయ కార్యాచరణ చేపట్టాలని నిర్ణయించారు. ప్రజలు కూడా అపరిచిత లింకులు, ఫోన్ కాల్స్, పెట్టుబడి పేరుతో వచ్చే మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సైబర్ మోసానికి గురైతే ఆలస్యం చేయకుండా జాతీయ సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ 1930కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని అధికారులు సూచించారు. వేగంగా ఫిర్యాదు చేయడం ద్వారా మోసపోయిన డబ్బును నిలిపివేసే అవకాశాలు మెరుగుపడతాయని తెలిపారు.