భూ సమస్యల పరిష్కారానికి చర్యలు
ఆసిఫాబాద్, నవంబర్ 3 (విజయక్రాంతి): జిల్లాలో రైతులు ఎదుర్కొంటున్న భూ సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ కె.హరిత(Collector Haritha) తెలిపారు. మంగళవారం దహేగాం తహసీల్దార్ కార్యాలయంలో సబ్ కలెక్టర్ హర్ష చౌదరితో కలిసి రెవెన్యూ సదస్సులో పాల్గొన్నారు. అప్పటికప్పుడు పరిష్కారమయ్యే సమస్యలను అదే రోజు పరిష్కరిస్తామని, రైతులు దరఖాస్తులు సమర్పించాలని సూచించారు. ప్రజాసేతు యాప్ ద్వారా ఇంటి నుంచే క్యూ ఆర్ కోడ్‌తో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. హత్తిని గ్రామానికి చెందిన మహిళా రైతు బాణక్కకు మీ సేవ స్లాట్ బుకింగ్ కోసం రూ.1,500 ఆర్థిక సాయం అందించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ మునవర్ షరీఫ్, రెవెన్యూ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.