గ్రామ భద్రతకు సీసీ కెమెరాలు కీలకం

20-11-2026 | 11:31pm

అశ్వాపురం, నవంబర్ 20 (విజయక్రాంతి): గ్రామంలో శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణలో(Crime Control) ప్రజల భాగస్వామ్యం ఎంతో కీలకమని అశ్వాపురం సీఐ సీహెచ్. ఎల్లయ్య(Ashwapuram CI Ch. Ellayya) అన్నారు. కమ్యూనిటీ పోలీసింగ్‌లో భాగంగా శుక్రవారం మొండికుంట గ్రామంలో వ్యాపారస్తులు, గ్రామ ప్రజలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతి వ్యాపారస్తుడు తమ దుకాణాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. సీసీ కెమెరాల(CCTV cameras) ద్వారా 24 గంటల పాటు నిఘా ఉంచడంతో పాటు ఏదైనా నేరం లేదా అవాంఛనీయ సంఘటన జరిగినప్పుడు నిందితులను త్వరగా గుర్తించే అవకాశం ఉంటుందన్నారు.

గ్రామంలో అనుమానాస్పద వ్యక్తులు, కార్యకలాపాలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. యువత ప్రవర్తనపై తల్లిదండ్రులు ప్రత్యేక దృష్టి సారించాలని, సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గుర్తుతెలియని వ్యక్తులు పంపే లింకులను ఓపెన్ చేయవద్దని హెచ్చరించారు. గ్రామ భద్రత పోలీసుల బాధ్యత మాత్రమే కాదని, ప్రజలు కూడా బాధ్యతగా వ్యవహరిస్తూ పోలీసులకు సహకరించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ వ్యాపారస్తులు, ప్రజలు, ప్రజాప్రతినిధులు, యువకులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు