సింగరేణి పాలిటెక్నిక్ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు

20-11-2026 | 11:55pm

- విద్యార్థుల తల్లిదండ్రులతో జీఎం ఎడ్యుకేషన్ ప్రత్యేక సమావేశం

శ్రీరాంపూర్, (విజయక్రాంతి) : సింగరేణి సంస్థ(Singareni Company) ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న విద్యాసంస్థల అభివృద్ధికి, విద్యార్థులకు నాణ్యమైన సాంకేతిక విద్యను(technical education) అందించేందుకు యాజమాన్యం ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తోందని ఎస్సీసీఎల్ ఎడ్యుకేషన్ సొసైటీ(SCCL Education Society) జనరల్ మేనేజర్ రాజేంద్ర ప్రసాద్ అన్నారు. శుక్రవారం విధి నిర్వహణలో భాగంగా మంచిర్యాల జిల్లాలోని(Mancherial District) సింగరేణి కాలరీస్ పాలిటెక్నిక్ కళాశాలను సందర్శించారు. ఈ సందర్భంగా కళాశాలలో విద్యనభ్యసిస్తున్న విద్యార్థుల తల్లిదండ్రులతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించి, విద్యార్థుల విద్యా ప్రగతి, బోధనా ప్రమాణాలు, కళాశాలలో కల్పిస్తున్న వసతులు, మౌలిక సదుపాయాలు తదితర అంశాలపై చర్చించారు.

ముఖ్యంగా విద్యార్థుల హాజరు, ఫలితాలు తదితర అంశాలపై ప్రత్యేకంగా చర్చించారు. విద్యార్థుల భవిష్యత్తు ఉన్నతంగా తీర్చిదిద్దడంలో తల్లిదండ్రులు, అధ్యాపకులు, కళాశాల యాజమాన్యం సమన్వయంతో పనిచేయాలని సూచించారు. సుమారు 75 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న సింగరేణి కాలరీస్ పాలిటెక్నిక్ కళాశాలలో ప్రస్తుతం సివిల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, మైనింగ్ ఇంజనీరింగ్ అనే ఐదు విభాగాలు కొనసాగుతున్నాయన్నారు. ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా విద్యార్థులకు నాణ్యమైన సాంకేతిక విద్యను అందించడంతో పాటు, భవిష్యత్ తరాలకు ఉపయోగపడే ఆధునిక కోర్సులు, నూతన సాంకేతిక విద్యా విధానాలను ప్రవేశపెట్టే దిశగా కూడా ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు తెలిపారు. 

ఈ సందర్భంగా ఎడ్యుకేషన్ సొసైటీ జీఎం రాజేంద్ర ప్రసాద్ కళాశాలను సందర్శించి, విద్యార్థులు, తల్లిదండ్రులు, అధ్యాపకులతో నేరుగా మాట్లాడి విలువైన సూచనలు, సలహాలు అందించడం పట్ల కళాశాల ప్రిన్సిపాల్ డినీల్ కుమార్, డిప్యూటీ జనరల్ మేనేజర్, వివిధ విభాగాధిపతులు హర్షం వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు