ట్రాక్టర్ బోల్తా.. రైతు దుర్మరణం

21-11-2026 | 12:03am

వ్యవసాయ భూమిని దున్నుతుండగా ప్రమాదం..

ఊపిరాడక అక్కడికక్కడే మృతి

మునుగోడు,నవంబర్ 20 (విజయక్రాంతి): వ్యవసాయ భూమిని(Agricultural land) దున్నుతుండగా ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడటంతో ఓ రైతు దుర్మరణం పాలయ్యాడు. ఈ విషాద ఘటన మునుగోడు మండలం ఊకొండి గ్రామంలో శుక్రవారం సాయంత్రం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఊకొండి గ్రామానికి చెందిన చండపాక లింగస్వామి (47) శుక్రవారం సాయంత్రం సుమారు 4 గంటల సమయంలో తన వ్యవసాయ భూమిని ట్రాక్టర్‌తో దున్నుతున్నాడు.

ఈ క్రమంలో ట్రాక్టర్‌ను రివర్స్ చేస్తుండగా పొలం వెనుక భాగం పల్లంగా ఉండటంతో అదుపుతప్పి బోల్తా పడింది. ట్రాక్టర్ లింగస్వామిపై పడటంతో కడుపు, తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఎడమ కాలు విరిగింది. ట్రాక్టర్ కింద చిక్కుకుని ఊపిరాడక అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడి భార్య సుగుణమ్మ ఫిర్యాదు మేరకు మునుగోడు పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నల్గొండ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించారు.

మరిన్ని వార్తలు