విధ్వంసంపై మౌనం వీడాలి
- బాధ్యులపై చర్యలు తీసుకోవాలి..
- త్వరలో రిలే దీక్షలు
- ఎస్యూ అధ్యక్షుడు మద్దెల కేశవ్ డిమాండ్
కరీంనగర్, క్రైం నవంబర్ 20 (విజయక్రాంతి): కరీంనగర్(Karimnagar) లోని శాతవాహన విశ్వవిద్యాలయంలో(Satavahana University) జరుగుతున్న పర్యావరణ విధ్వంసంపై(Environmental destruction) ఉన్నతాధికారులు, అధ్యాపక సిబ్బంది మౌనం వహించడంపై విద్యార్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులు చేపట్టిన కార్యక్రమాలను అసత్య ప్రచారాలుగా(False propaganda) అభివర్ణించిన ఉన్నతాధికారులు, వాస్తవాలను వెల్లడించి విద్యార్థులకు సమాధానం చెప్పాలని శాతవాహన యూనివర్సిటీ అధ్యక్షుడు మద్దెల కేశవ్ శుక్రవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.
విద్యార్థుల ఆందోళనలను నిర్లక్ష్యం చేయడం, సమస్యపై స్పందించకుండా మౌనం వహించడం సరైన విధానం కాదన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి స్పష్టమైన వివరణ ఇవ్వాలని, లేనిపక్షంలో త్వరలో రిలే దీక్షలు చేపడతామని హెచ్చరించారు. విశ్వవిద్యాలయంలో పర్యావరణ విధ్వంసానికి కారణమైన బాధ్యులను గుర్తించి సమగ్ర విచారణ జరపాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
తొలగించిన చెట్ల స్థానంలో కొత్త మొక్కలు నాటి, వాటి సంరక్షణ బాధ్యతను యూనివర్సిటీ ఉన్నతాధికారులు తీసుకోవాలని స్పష్టం చేశారు. అభివృద్ధి పేరుతో పర్యావరణాన్ని దెబ్బతీయడం ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని, విద్యార్థుల ప్రశ్నలకు సమాధానం చెప్పి, పర్యావరణ పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని మద్దెల కేశవ్ కోరారు.