ఐడీఓసీలో అంగరంగ వైభవంగా బతుకమ్మ సంబరాలు
- బతుకమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించిన జిల్లా కలెక్టర్ అంకిత్, అదనపు కలెక్టర్ డి. వేణుగోపాల్
- ఐడీఓసీ సిబ్బంది, రెవెన్యూ, పౌరసరఫరాలు, సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో వేడుకలు
భద్రాద్రి కొత్తగూడెం, (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం(Integrated District Offices Complex) (ఐడీఓసీ)లో దసరా పండుగను పురస్కరించుకుని బతుకమ్మ సంబరాలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఐడీఓసీ సిబ్బంది, రెవెన్యూ శాఖ, పౌరసరఫరాల శాఖ రేషన్ షాపు డీలర్లు, అన్ని సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలు సంప్రదాయబద్ధంగా, ఆనందోత్సాహాల మధ్య సాగాయి.
ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ అంకిత్, అదనపు కలెక్టర్ డి. వేణుగోపాల్ ముఖ్య అతిథులుగా హాజరై బతుకమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను పురస్కరించుకుని ఐడీఓసీ ప్రాంగణంలో వివిధ రకాల రంగురంగుల పుష్పాలతో బతుకమ్మలను అందంగా పేర్చారు. పూలతో ఆకర్షణీయంగా అలంకరించిన బతుకమ్మలు వేడుకలకు ప్రత్యేక శోభను తీసుకొచ్చాయి. మహిళా ఉద్యోగులు భక్తిశ్రద్ధలతో బతుకమ్మకు పూజలు నిర్వహించి, పూలు సమర్పిస్తూ సంప్రదాయాలను పాటించారు.
ఈ సందర్భంగా మహిళా ఉద్యోగులు సంప్రదాయ బతుకమ్మ పాటలు పాడుతూ బతుకమ్మల చుట్టూ చేరి ఉత్సాహంగా ఆడిపాడారు. తెలంగాణ ఆడపడుచుల ఐక్యత, ఆత్మీయత, సాంస్కృతిక వైభవాన్ని ప్రతిబింబించేలా వేడుకలు కొనసాగాయి. వివిధ శాఖలకు చెందిన మహిళా ఉద్యోగులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొని బతుకమ్మ సంబరాలను ఉత్సాహంగా జరుపుకున్నారు. పూల అలంకరణలు, సంప్రదాయ పాటలు, ఆటపాటలతో ఐడీఓసీ ప్రాంగణం పండుగ శోభను సంతరించుకుంది.
ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన, జిల్లా రెవెన్యూ అధికారి పద్మావతి, డీపీఓ అనూష, మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి స్వర్ణలత లెనినా, ఐడీఓసీ మహిళా ఉద్యోగులు, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, పౌరసరఫరాల శాఖ రేషన్ షాపు డీలర్లు తదితరులు పాల్గొన్నారు.