కాయకల్ప్‌లో భద్రాద్రి జిల్లా ఆసుపత్రుల దూకుడు

15-10-2026 | 05:54pm
  1. 5 ఆసుపత్రులు.. 6 అవార్డులు 
  2. (ఒక రాష్ట్రస్థాయి అవార్డుతో పాటు ప్రతి ఆసుపత్రి కి ఒక అవార్డు)
  3. రాష్ట్రం లో 100 శాతం అవార్డులతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రికార్డు
  4. రాష్ట్రం లో ఏకైక ‘ఎకో ఫ్రెండ్లీ’ రాష్ట్ర అవార్డు పాల్వంచకు

భద్రాద్రి కొత్తగూడెం, అక్టోబర్ 15:(విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టి వి వి పీ ఆసుపత్రులు కాయకల్ప్‌లో(District TVVP Hospitals – Kayakalp) సత్తా చాటాయి. మార్చి 2026 లో కాయకల్ప్ నాణ్యతా ప్రమాణాల పరిశీలనకు హాజరైన జిల్లాలో ని 5 టీవీవీపీ  ఆసుపత్రులకు 6 రాష్ట్రస్థాయి అవార్డులు లభించాయి. పరిశీలనకు వెళ్లిన ప్రతి ఆసుపత్రి అవార్డు సాధించి 100 శాతం విజయాన్ని నమోదు చేసింది.

ఒక్కో అవార్డుకు రూ.1 లక్ష చొప్పున మొత్తం రూ.5 లక్షల ప్రైజ్‌మనీ తో పాటు పాల్వంచ ఆసుపత్రి కి రాష్ట్ర ఎకో ఫ్రెండ్లీ అవార్డు కి 5 లక్షల తో కలిపి మొత్తం 10 లక్షలు జిల్లాకు లభించనుంది. ఎకో ఫ్రెండ్లీ విభాగం లో ప్రకటించిన ఏకైక రాష్ట్ర అవార్డు పాల్వంచ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కి రావడం విశేషం గా నిలిచింది.

5 ఆసుపత్రులకు 6 అవార్డులు పాల్వంచను సిఎచ్ సి కి రాష్ట్రస్థాయి అవార్డుతో పాటు ఎకో  ఫ్రెండ్లీ అవార్డు లభించింది. ఏరియా ఆసుపత్రి – భద్రాచలంకు, ఇల్లందు , అశ్వరావుపేట, మణుగూరు ఆసుపత్రులకు కమెండేషన్ అవార్డు లు వరించాయి.

తొలిసారే.. అయిన అవార్డుల పంట మణుగూరు, అశ్వారావుపేట ఏరియా ఆసుపత్రులు తొలిసారిగా కాయకల్ప్ నాణ్యతా ప్రమాణాల పరిశీలనకు హాజరై అవార్డులు సాధించడం విశేషం. జిల్లాలో కాయకల్ప్ నాణ్యతా ప్రమాణాల పరిశీలనకు వెళ్లిన అన్ని 5 ఆసుపత్రులు అవార్డులు సాధించడం ఇదే తొలిసారి. దీంతో జిల్లా TVVP చరిత్రలో ఇది ఒక కొత్త అధ్యాయంగా నిలిచింది.

పరిశుభ్రత.. నాణ్యతకు కాయకల్ప్

ప్రభుత్వ ఆసుపత్రుల్లో పరిశుభ్రత, పారిశుద్ధ్యం, బయోమెడికల్ వ్యర్థాల నిర్వహణ, ఇన్‌ఫెక్షన్ కంట్రోల్, పర్యావరణ పరిరక్షణ, రోగులకు అందించే సేవలు, ఆసుపత్రి నిర్వహణ, నాణ్యతా ప్రమాణాల మెరుగుదల వంటి అంశాలను కాయకల్ప్‌లో పరిశీలిస్తారు.

సమష్టి కృషితోనే విజయం

గత జిల్లా కలెక్టర్ శ్రీ జితేష్ పాటిల్ ఆసుపత్రులకు అవసరమైన మౌలిక వసతులు, సౌకర్యాలు కల్పించేందుకు ప్రత్యేక సహకారం అందించారు. ప్రస్తుత జిల్లా కలెక్టర్ శ్రీ అంకిత్ ఐటీడీఏ పీవో రాహుల్ లు నిరంతరం సహకరిస్తున్నారు.

డి సి హెచ్ ఎస్ డాక్టర్ రవిబాబు ప్రత్యేక చొరవ తీసుకుని అన్ని ఆసుపత్రుల సిబ్బందిని సమన్వయం చేస్తూ కాయకల్ప్ ప్రమాణాలపై శిక్షణ, అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. అవసరమైన ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ, ముఖ్యంగా తొలిసారి పరిశీలనకు హాజరైన ఆసుపత్రులు కూడా అవార్డులు సాధించేలా ప్రత్యేకంగా కృషి చేశారు.

“సిబ్బంది ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు”

డాక్టర్ రవి బాబు మాట్లాడుతూ.. “జిల్లా వైద్య విధాన పరిషత్ చరిత్రలో ఇది గొప్ప మైలురాయి. కాయకల్ప్ నాణ్యతా ప్రమాణాల పరిశీలనకు వెళ్లిన 5కి 5 ఆసుపత్రులు అవార్డులు సాధించడం, 100 శాతం విజయాన్ని నమోదు చేయడం ఎంతో గర్వకారణం. సిబ్బంది ఈ అవార్డులను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని పూర్తి అంకితభావంతో, నిబద్ధతతో పనిచేశారు. వారి సమష్టి కృషి, అంకితభావం వల్లే ఈ ఘనత సాధ్యమైంది. అవార్డు సాధించిన ప్రతి ఒక్క సిబ్బందికి హృదయపూర్వక అభినందనలు.” అని తెలిపారు.

మరిన్ని వార్తలు