సర్ ప్రక్రియ పై కాంగ్రెస్ నిరాధార ఆరోపణలు సరికావు
కపట రాజకీయాల తో ప్రజలను మోసం చేయలేరు...
కాంగ్రెస్ తీరుపై నిప్పులు చెరిగిన బిజెపి జిల్లా అధ్యక్షులు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి
కొత్తగూడెం నవంబర్ 6 (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని(Bhadradri Kothagudem District) బిజెపి జిల్లా కార్యాలయంలో(BJP District Office) ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో, బిజెపి జిల్లా అధ్యక్షులు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి(Byreddy Prabhakar Reddy) మాట్లాడుతూ, ఓటమి భయంతో వణికిపోతున్న కాంగ్రెస్ పార్టీ(Congress Party) రాజ్యాంగబద్ధమైన ఎన్నికల సంఘం పారదర్శకంగా నిర్వహిస్తున్న ఓటర్ల జాబితా(Voter List) ప్రత్యేక ముమ్మర సవరణ (SIR) ప్రక్రియపై బురద జల్లడమే పనిగా పెట్టుకుందని, తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అధికార దాహంతో రాజ్యాంగ వ్యవస్థల(Constitutional System) విశ్వసనీయతను దెబ్బతీసేందుకు, కాంగ్రెస్ దిగజారుడు రాజకీయం చేస్తోందని మండిపడ్డారు.
ఓటమి భయంతోనే కాంగ్రెస్ పార్టీ నీచమైన ఆగడాలు సరికాదన్నారు. ఓటర్ల జాబితాలో బోగస్ ఓట్లను తొలగించి, అర్హులైన ప్రతి పౌరుడికి ఓటు హక్కు కల్పించేందుకు ఇసి చేపడుతున్న పారదర్శక ప్రక్రియను, చూసి కాంగ్రెస్ నాయకుల్లో వణుకు మొదలైందన్నారు. గతంలో తాము చేసిన అక్రమాలు, బోగస్ ఓట్లు ఎక్కడ ఊడిపోతాయోనన్న అభద్రతా భావంతోనే ఇటువంటి అసత్య ప్రచారాలకు తెగబడుతున్నారు. రాజ్యాంగ వ్యవస్థలపై దాడి, ప్రజాస్వామ్య వ్యవస్థలను గౌరవించడం కాంగ్రెస్ చరిత్రలోనే లేదన్నారు. ఎన్నికల్లో గెలిస్తే వ్యవస్థలు బాగున్నట్లు, ఓడిపోయే పరిస్థితి వస్తే ఇసి, ఈవిఎంలపై బురద జల్లడం కాంగ్రెస్కు పరిపాటిగా మారిందన్నారు. ఇది వారి రాజకీయ దాస్టికానికి పరాకాష్ఠ అన్నారు.
దమ్ముంటే చర్చకు రండి అంటూ బిజెపి అధ్యక్షులు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి సవాల్ విసిరారు. కాంగ్రెస్ నాయకులకు నిజంగా ప్రజాస్వామ్యంపై నమ్మకం, తమ ఆరోపణల్లో సత్యం ఉంటే , తగిన ఆధారాలతో బహిరంగ చర్చకు సిద్ధం కావాలంటూ. ఎక్కడ అక్రమాలు జరిగాయో నిరూపించ లేకపోతే ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని ,క్షేత్రస్థాయిలో బిజెపి శ్రేణులు ప్రతి గడపకూ వెళ్లి కాంగ్రెస్ నకిలీ రంగును ఎండగడతామని ఈ సందర్భంగా తెలియజేశారు.
రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్య వ్యతిరేక వైఖరిపై, భద్రాద్రి కొత్తగూడెం జిల్లావ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టి, వారి అసలు స్వరూపాన్ని ప్రజల ముందు నగ్నంగా నిలబెడతామని బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి హెచ్చరించారు.
ఈ విలేకరుల సమావేశంలో బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి జాటోత్ వెంకన్న నాయక్, మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు సముద్రాల గాయత్రి, లక్ష్మీదేవి పల్లి మండల్ అధ్యక్షులు నవీన్, చుంచుపల్లి మండలాధ్యక్షులు బలగం శ్రీధర్, యువ మోర్చా జిల్లా అధ్యక్షులు మోహన్ కృష్ణ, యువ మోర్చా ప్రధాన కార్యదర్శి కోల హరీష్, ఎస్టీ మోర్చా ఉపాధ్యక్షులు మంగీలాల్ నాయక్, ఎస్సీ మోర్చా కార్యదర్శి మహంకాళి శంకర్, సబ్బాని రాజేష్, లక్ష్మీదేవి పల్లి మండల కార్యదర్శి పవన్, ముకుంద నాయక్ తదితరులు పాల్గొన్నారు.