సైబర్ మోసానికి పోలీసుల చెక్

13-11-2026 | 07:11pm

అశ్వాపురం, నవంబర్ 13 (విజయక్రాంతి): క్రెడిట్ కార్డు(Credit card) ద్వారా రూ.4,97,526 సైబర్ మోసానికి గురైన బాధితుడికి జిల్లా పోలీసులు అండగా నిలిచారు. జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ ప్రత్యేక పర్యవేక్షణలో జిల్లా సైబర్ క్రైమ్ సెల్(District Cyber ​​Crime Cell) వేగంగా స్పందించి రూ.1,62,470 బాధితుడి ఖాతాలోకి తిరిగి జమ చేయించగా, మరో రూ.3,35,056ను నేరగాళ్లకు సంబంధించిన బ్యాంకు ఖాతాల్లో నిలిపివేయించారు.

వివరాల్లోకి వెళితే అశ్వాపురం పరిధిలోని హెవీ వాటర్ ప్లాంట్‌లో పనిచేస్తున్న సుశీల్ కుమార్ క్రెడిట్ కార్డు నుంచి ఈ నెల 8వ తేదీన నాలుగు విడతలుగా సైబర్ నేరగాళ్లు రూ.4,97,526 కాజేశారు. వెంటనే అప్రమత్తమైన బాధితుడు 1930 సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదు చేయడంతో పోలీసులు స్పందించి సంబంధిత బ్యాంకు అధికారులతో సమన్వయం చేసుకుని నగదు బదిలీలను నిలువరించేందుకు చర్యలు చేపట్టారు.

ఈ ఘటనపై ఈ నెల 9న అశ్వాపురం పోలీస్ స్టేషన్‌లో క్రైమ్ నంబర్ 162/2026గా బీఎన్ఎస్ సెక్షన్ 318(4), ఐటీ చట్టంలోని 66(సి), 66(డి) సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సైబర్ క్రైమ్ ఇన్‌స్పెక్టర్ కే. నరేష్, ఎస్సై ఎస్.కే. జుబేదా, సిబ్బంది డి. వంశీకృష్ణ, బి. శ్రావణ్ కుమార్, వి. రజిత, సుప్రియ సమన్వయంతో పనిచేసి బాధితుడి సొమ్మును సురక్షితం చేయడంలో కీలక పాత్ర పోషించారు.

ఈ సందర్భంగా ఎస్పీ రోహిత్ రాజు మాట్లాడుతూ సైబర్ మోసానికి గురైన వెంటనే ఆలస్యం చేయకుండా 1930 హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదు చేయాలని సూచించారు. ముఖ్యంగా గోల్డెన్ అవర్‌లో ఫిర్యాదు చేస్తే మోసపోయిన నగదును నిలువరించి తిరిగి పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని తెలిపారు. అపరిచిత లింకులను క్లిక్ చేయడం, ఓటీపీలు, బ్యాంకు వివరాలను ఇతరులకు వెల్లడించడం వంటి వాటికి దూరంగా ఉండాలని ప్రజలకు సూచించారు.

మరిన్ని వార్తలు