ప్రమాదకరంగా దమ్మపేట, నల్లకుంట రోడ్డు

07-11-2026 | 05:57pm

పొంచి వున్న ప్రమాదం

దమ్మపేట,(విజయక్రాంతి): మురసు తుఫాను(Murasu Cyclone) ప్రభావంతో కురిసిన భారీ వర్షానికి(Heavy rains) దమ్మపేట పేరంటాళ్ల చెరువు అలుగు కాలువకు రెండు చోట్ల భారీ గండ్లు పడ్డాయి. దీంతో భారీగా వచ్చిన వరద పేరంటాళ్ల చెరువుకు సుమారు 400 మీటర్ల దూరంలో వున్న తారు రోడ్డుపై నుండి ప్రవహించి గుడిమెట్ల బాలరాజు పామాయిల్ తోట వద్ద మూడు అడుగుల లోతున తారు రోడ్డు క్రింద నుండి మట్టి కొట్టుకునిపోయింది. ఈ రోడ్డు మార్గం గుండా భారీ వాహనాలు ప్రయాణిస్తుంటాయి.

పైకి రోడ్డు ఉన్నట్లు కన్పించినా రోడ్డు క్రింద ఉన్న మట్టి కొట్టుకునిపోవడంతో భారీ వాహనాలు వెళ్తే మాత్రం ప్రమాదం జరిగే అవకాశం వుంది. అదేవిధంగా మల్కారం, పెద్దగొల్లగూడెం, అచ్యుతాపురం, చిన్నగొల్లగూడెం, నల్లకుంట పామాయిల్ రైతులు నిత్యం పామాయిల్ గెలలను వేసుకుని సుమారు 4, 5 టన్నుల బరువుతో అప్పారావుపేట పామాయిల్ ఫ్యాక్టరీకి తరలిస్తుంటారు. రైతులు, ప్రజలు ఈ మార్గంలో నిత్యం రాత్రి వేళల్లో కూడా ప్రయాణిస్తుంటారు. ఏదైనా ప్రమాదం జరుగక ముందే అధికారులు త్వరగా స్పందించి ఆర్ అండ్ బి రోడ్డుకు మరమ్మత్తులు చేయాలని రైతులు, ప్రజలు కోరుతున్నారు.

మరిన్ని వార్తలు