రోగి భద్రతే ప్రథమ ప్రాధాన్యం
- బస్తీ దవాఖానాలు, పీహెచ్‌సీల్లో డీఎంహెచ్‌ఓ ఆకస్మిక తనిఖీలు
ఇల్లెందు, (విజయక్రాంతి): ప్రపంచ రోగి భద్రతా వారోత్సవం(World Patient Safety Week celebrations) సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ తుకారామ్ రాథోడ్(DMHO Dr. Tukaram Rathod) మంగళవారం ఇల్లెందు పట్టణంలోని ఎల్‌బీఎస్ నగర్, హమాలీ బస్తీ దవాఖానాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. వైద్య సేవలు, రోగుల హాజరు, మందుల లభ్యత, వైద్య పరికరాలు, పరీక్షా కిట్లను పరిశీలించారు. అవసరమైన మందులు, వైద్య సామగ్రి, పరీక్షా కిట్లు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. ఎల్‌బీఎస్ నగర్ దవాఖానాలో బీపీ పరీక్షలకు అవసరమైన పరికరాలను సమకూర్చుకోవాలని సూచించారు.
అనంతరం కొమరారం పీహెచ్‌సీని సందర్శించి వైద్య సిబ్బందితో సమావేశమయ్యారు. గర్భిణీలకు క్రమం తప్పకుండా పరీక్షలు నిర్వహిస్తూ పోషకాహారం, ప్రమాద సంకేతాలపై అవగాహన కల్పించాలని సూచించారు. సాధారణ ప్రసవాలకు ప్రోత్సాహం ఇవ్వడంతో పాటు రాబోయే మూడు నెలల ప్రసవ అంచనా తేదీల (ఈడీడీ) వివరాలను పక్కాగా నిర్వహించి ఫాలోఅప్ చేయాలన్నారు. రొంపేడు పీహెచ్‌సీలో రోగి భద్రత, పరిశుభ్రత, మందుల వినియోగం, వ్యాధుల నివారణ, పోషకాహారంపై సిబ్బందికి అవగాహన కల్పించారు. ఆసుపత్రులకు వచ్చే వారితో పాటు క్షేత్రస్థాయి పర్యటనలు, ఆరోగ్య శిబిరాలు, ఇంటింటి సందర్శనల్లోనూ ప్రజలకు ఆరోగ్య విద్య అందించాలని సూచించారు. వైద్య సేవల్లో నిర్లక్ష్యానికి తావులేకుండా రోగి భద్రతకు అత్యంత ప్రాధాన్యమిస్తూ పనిచేయాలని డీఎంహెచ్‌ఓ ఆదేశించారు.