ఎస్ఐఆర్ విచారణను మార్గదర్శకాల ప్రకారం నిర్వహించాలి
నోటీసులు అందుకున్న ఓటర్లు సంబంధిత పత్రాలను సమర్పించేలా చర్యలు తీసుకోవాలి
ఓటర్ల వివరాలను ఆన్లైన్లో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా నమోదు చేయాలి
పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష
సుల్తానాబాద్,(విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా(Peddapalli District) సుల్తానాబాద్ మున్సిపల్ పరిధిలోని 5వ వార్డులో శ్రీ వాణి డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో జరుగుతున్న ఎస్ఐఆర్ ప్రక్రియను(Special Intensive Revision) పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఎస్ఐఆర్ విచారణను మార్గదర్శకాల ప్రకారం నిర్వహించాలని, నోటీసులు అందుకున్న ఓటర్లు సంబంధిత పత్రాలు సమర్పించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఓటర్ల వివరాలను ఆన్లైన్లో ఎలాంటి పొరపాటుకు తావు లేకుండా నమోదు చేయాలన్నారు. ఎలిగేడు మండలం ర్యాకల్ దేవుపల్లిలో, సుల్తానాబాద్ లో ఎస్ఐఆర్ ప్రక్రియను కలెక్టర్ పరిశీలించారు.
అలాగే సుల్తానాబాద్‌లో నూతనంగా నిర్మిస్తున్న ప్రాథమిక పాఠశాల, ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చేపడుతున్న అదనపు తరగతి గదుల నిర్మాణ పనులను పరిశీలించారు. అదనపు తరగతి గదుల నిర్మాణ పనులను రెండు నెలల వ్యవధిలో పూర్తి చేసి విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థులకు అవసరమైన మౌలిక వసతులు సకాలంలో అందేలా పనులను వేగవంతం చేయాలని, నిర్మాణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ఈ పర్యటనలో కలెక్టర్ వెంట పలువురు అధికారులు ఉన్నారు.